టెన్షన్‌.. అటెన్షన్‌..!

21 Mar, 2017 23:40 IST|Sakshi
టెన్షన్‌.. అటెన్షన్‌..!
- నేడు మంజునాథ కమిషన్‌ విచారణ
- కాపులకు బీసీ రిజర్వేషన్లపై ఇరువర్గాల నుంచి అభిప్రాయ సేకరణ
- బల ప్రదర్శనకు సిద్ధమవుతున్న సామాజిక వర్గాలు
- సెక‌్షన్‌-30 అమలు.. ప్రదర్శనలపై నిషేధం
- కాకినాడలో అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టులు
- డ్రోన్, వీడియో కెమెరాల చిత్రీకరణ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపులకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై ఏర్పాటైన జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ బుధవారం విచారణ జరపనున్న నేపథ్యంలో.. జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. విచారణకు వేదిక కానున్న కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంవద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి కాపు, బీసీ వర్గాల నుంచి, అభిప్రాయాలను, వినతులను కమిషన్‌ స్వీకరించనుంది. దీంతో తమతమ వాదనలు వినిపించేందుకు, అభిప్రాయాలు తెలిపేందుకు ఇటు కాపులు, అటు బీసీలు అధిక సంఖ్యలో కాకినాడకు తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతోపాటు కాపు జేఏసీ నేతలు వీవై దాసు, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ.. మరోవైపు బీసీల నుంచి కుడుపూడి సూర్యనారాయణరావు, కుడుపూడి చిట్టబ్బాయి తదితర నేతలు కమిషన్‌ ముందు వాదనలు వినిపించేందుకు, వినతులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమాన్ని నడిపిస్తున్న కీలక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సొంత జిల్లా కావడంతో.. జిల్లాలో పరిణామాలను చంద్రబాబు సర్కార్‌ సహజంగానే నిశితంగా పరిశీలిస్తోంది. ఇది సున్నితమైన వ్యవహారం కావడంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. మరోపక్క కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంజునాథతోపాటు సభ్యులు ప్రొఫెసర్‌ వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్‌ మల్లెల పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్‌ శ్రీమంతుల సత్యనారాయణ, సభ్య కార్యదర్శి ఎ.కృష్ణమోహన్, ప్రత్యేకాధికారి సి.రమేష్‌కుమార్, సీనియర్‌ అకౌంటెంట్‌ అనురాధ మంగళవారమే కాకినాడ చేరుకున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
తమకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు ఆ మాట నిలబెట్టుకోవాలని కాపు సామాజికవర్గం చాలాకాలంగా ఉద్యమిస్తుండగా.. కాపులను బీసీల్లో కలపడాన్ని బీసీ సామాజికవర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కమిషన్‌ విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. ఎక్కడా ఎటువంటి కవ్వింపు చర్యలూ చోటుచేసుకుండా పోలీసు శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ఏలూరు రేంజ్‌ డీఐజీ రామకృష్ణ జిల్లాలో మకాం వేసి, జిల్లా ఎస్పీ రవిప్రకాష్, అదనపు ఎస్పీ దామోదర్‌ తదితర పోలీసు అధికారులతో కాకినాడలో పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటికే జిల్లా అంతటా సెక‌్షన్‌-30 అమలు చేస్తున్నారు. అవసరమైతే బుధవారం మరీ ఇబ్బందికర పరిణామాలు తలెత్తినచోట 144 సెక‌్షన్‌ అమలు చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే అమలాపురం, తుని, పిఠాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, రామచంద్రపురం తదితర ప్రాంతాల్లో రెండు సామాజిక వర్గాల నుంచి రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీల పేరుతో అల్లర్లకు దిగుతారేమోనన్న అనుమానంతో ముందస్తుగా 149 సెక‌్షన్‌ ప్రకారం పెద్ద సంఖ్యలో నోటీసులు కూడా జారీ చేశారు. ఊరేగింపులు, ఇతర ఆందోళనలను నిషేధించారు.
మద్యం దుకాణాలపైనా ఆంక్షలు
కాకినాడకు వచ్చే ప్రధాన రోడ్ల పక్కన ఉండే మద్యం దుకాణాలను కూడా మూసివేసేందుకు జిల్లా పోలీసులు చర్యలు చేపట్టారు. రోడ్ల చెంత జిల్లాలో దాదాపు 40 కీలక ప్రదేశాల్లో పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను తనిఖీ చేసి పంపించనున్నారు. ఆకాశంలో డ్రోన్‌ కెమెరాలతో.. నేలపై వీడియో కెమెరాలతో ప్రతి కదలికను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. బాడీ కెమెరాతో కూడా మఫ్టీలో ఉన్న పోలీసులు జనంలో సంచరించేలా బాధ్యతలు అప్పగించారు. కాకినాడలోని పలు ప్రాంతాల్లో సుమారు 1,715 మంది పోలీసులను వినియోగిస్తుండగా, జిల్లా అంతటా పోలీసులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఆడిటోరియంలోకి వెళ్లే ముందు మద్యం తాగినవారిని కనుగొనేందుకు బ్రీత్‌ ఎనలైజర్లు కూడా ఏర్పాటు చేశారు.
చెరి 175 మందికే అనుమతి
ఒక్కో వర్గం నుంచి 175 మందిని మాత్రమే వాదనలు వినిపించేందుకు కమిషన్‌ ముందుకు అనుమతిస్తారు. వారు బయటకు వచ్చాక మరో 175 మందిని వాదనలు వినిపించేందుకు అనుమతించనున్నారు.
మరిన్ని వార్తలు