రిజర్వేషన్లతోనే కాపుల సర్వతోముఖాభివృద్ధి

30 Oct, 2016 00:21 IST|Sakshi
రిజర్వేషన్లతోనే కాపుల సర్వతోముఖాభివృద్ధి
 
  • 16 నుంచి సత్యాగ్రహ పాదయాత్ర
  • ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ
కిర్లంపూడి:
ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో కాపులకు ఇచ్చిన రిజర్వేషను హామీ సాధించుకుంటేనే జాతి అన్నివిధాలా అభివృద్ధి సాధిస్తుందని మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. శనివారం సాయంత్రం పిఠాపురం నియోజకవర్గం గోకివాడ గ్రామం నుంచి భారీ సంఖ్యలో కాపు నాయకులు, యువకులు ముద్రగడ నివాసానికి తరలివచ్చి ఆయన చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ బ్రిటిషు కాలంలో కాపులకు రిజర్వేషనులు కొనసాగేవని,  అనంతరం కొన్ని పరిణామాల వలన తొలగించారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషను అమలు చేయడమే కాకుండా ఏటా వెయ్యి కోట్లు ఇచ్చి కాపులను ఆర్థికంగా బలోపేతం చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. ఉద్యమం అనంతరం తాను చేసిన దీక్ష సమయంలో ప్రభుత్వ పెద్దలను పంపించి ఏడు నెలల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తానని దీక్షను విరమింపజేశారన్నారు. ఏడు నెలలు దాటినా ఇంత వరకూ ఇచ్చిన హామీ ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. కమిషను పేరుతో కాలయాపన చేసి కాపులను మోసం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రిజర్వేషను సాధనలో భాగంగా వచ్చే నెల 16 నుంచి ఐదు రోజుల పాటు రావులపాలెం నుంచి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ పాదయాత్ర చేపడుతున్నట్టు  వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, సంగిశెట్టి వెంకటేశ్వరరావు, గోకివాడ కాపు నాయకులు గరగ స్వామి, గరగ వీరబాబు, గరగ మహేశ్వరరావు, గోకివాడ బుజ్జి, నామా వెంకట్రావు, కీర్తి హరనాథబాబు, నామా పెద్దిరాజు, కొత్తెం బుజ్జి, నామా బుజ్జి వెంకట్రావు, కొత్తెం బాబూరావు, నామా కృష్ణ, విశ్వనాథుల సుబ్బారావు, అమలకంటి దొరబాబు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు