1994 కాపు ఉద్యమ కేసులపై ఆరా

16 Oct, 2016 18:55 IST|Sakshi
  • నవంబర్‌ 16 ముద్రగడ పాదయాత్రపై ముందస్తు విశ్లేషణl
  • నివేదికలపై జిల్లా పోలీసు శాఖ కసరత్తు
  • అమలాపురం టౌన్‌:
    వచ్చే నవంబర్‌ 16వ తేదీ నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నిర్వహిస్తారన్న ప్రకటన ప్రభుత్వంలో కదలిక తీసుకుని వచ్చింది. 1994లో కాపు రిజర్వేషన్ల కోసం ఆయన కిర్లంపూడి నుంచి తిరుపతి వరకూ సైకిల్‌ యాత్ర నిర్వహించినప్పుడు కాపుల నుంచి అనూహ్య స్పందన రావటమే కాకుండా జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ దారి పొడవునా ఆందోళనలు, కొన్ని విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో పోలీసులు కాపులపై అనేక కేసులు నమోదు చేశారు.  మళ్లీ 22 ఏళ్ల తర్వాత ముద్రగడ పాదయాత్రకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం నాటి యాత్ర ప్రభావాలు, పరిస్థితులపై ఆరా తీస్తూ ఒక అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పోలీసు ఉన్నతాధికారుల నుంచి జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లకు శనివారం అత్యవసర ఆదేశాలు వచ్చాయి. 1994లో ముద్రగడ సైకిల్‌ యాత్ర నిర్వహించినప్పుడు ఏఏ పోలీసు స్టేషన్లలో... ఏఏ కేసులు నమోదయ్యాయి. ఉద్యమ తీవ్రత, ఏయే సెక్షన్లపై నమోదు చేశారు వంటి వివరాలపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో శనివారం రాత్రి వరకూ జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో నాడు నమోదైన కేసుల వివరాలను పంపారు. నాడు ముద్రగడతో పాటు రాష్ట్ర కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి నేతలు దివంగత నల్లా సూర్యచంద్రరావు, ఆయన సోదరుడు ప్రస్తుత ఆ సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, నాటిæ ఉద్యమ నేతలు దివంగత సలాది స్వామినాయుడు, నేటి రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ తదితరులు నాటి సైకిల్‌యాత్రలో కిర్లంపూడి నుంచి తిరుపతి వరకూ సాగారు. అప్పట్లో కాపుల జన సాంద్రత ఎక్కువగా ఉండే కోనసీమలోని పలు పోలీసు స్టేషన్లలో దాదాపు 50 కేసులు నమోదయ్యాయి. రావులపాలెంలో ఐదు కేసులతో పాటు సామర్లకోటలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా కేసుల ప్రభావం, నివేదికలు ప్రస్తుత త్వరలో జరగనున్న పాదయాత్రపై ఎలా ఉంటాయనేది విశ్లేషిస్తున్నారు. పాదయాత్రపై పోలీసుల స్పందన ఎంత వరకూ ఉండాలి. పాదయాత్ర సమయంలో కాపులు ఏదైనా ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడే పరిస్థితులు ఉంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై పోలీసు శాఖ ఇప్పటి నుంచే అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. 
     
మరిన్ని వార్తలు