పంచ్‌ పాండవులు

7 Sep, 2017 10:57 IST|Sakshi
పంచ్‌ పాండవులు

కరాటేలో కొత్తవలస కుర్రాళ్ల ప్రతిభ
అంతర్జాతీయ డిప్లమో సాధన
జిల్లాలోనే తొలి జపాన్‌ డిప్లమో కైవశం
జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణాలు


ఆత్మరక్షణ విద్య అందరూ నేర్చుకుంటారు. అత్యుత్తమ ప్రమాణాలను కొందరే అందుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతారు. అయిదుగురు సామాన్య విద్యార్థులు ఆ ఘనత సాధించారు. జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో విజయం సాధించారు. పతకాలు కొల్లగొడుతున్నారు. కొత్తవలస మండలానికి చెందిన ఆ ‘పంచ్‌’ పాండవులపై స్ఫూర్తిదాయకమైన కథనమిది. –కొత్తవలస రూరల్‌

ఒకినోవా మార్షల్‌ ఆర్ట్స్‌ నుంచి గుజూర్యూ కరాటే– డో–ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఏషియా కరాటే చాంపియన్‌ షిప్, ఎంఎల్‌ఏ కప్, 14 ఆల్‌ ఇండియా కరాటే చాంపియన్‌ షిప్, 18 ఆల్‌ ఇండియా కరాటే చాంపియన్‌ షిప్, 1వ ఏపీ గుజూర్యూ కరాటే చాంపియన్‌ షిప్, నార్త్‌ ఏపీ గుజూర్యూ, సౌత్‌ ఇండియా గుజూర్యూ  జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని విజయ శిఖరాలు అధిరోహించారు.

ఇద్దరు విద్యార్థులు నేషనల్‌ స్పోర్ట్స్‌ కరాటే–డో–కాస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా కార్యదర్శిగా, సభ్యునిగా ఎంపికయ్యారు.

ఈ అయిదుగురు విద్యార్థులు జార్ఖండ్‌ రాష్ట్రంలో జూన్‌ 25, 26 తేదీల్లో జేఆర్‌డీ టాటా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన 12వ జాతీయ కరాటే పోటీల్లో పతకాలు సాధించారు. ఇదే కాంప్లెక్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ జపాన్‌ డిప్లమా పోటీల్లో పాల్గొని బ్లాక్‌ బెల్టులు సాధించటం జిల్లా చరిత్రలో తొలిసారి.

కొత్తవలస మండలానికి చెందిన ఎం.సుధీర్‌బాబు, ఎన్‌.భరత్‌ కుమార్, ఎం.నరేంద్ర, ఎం.నీలాంజీని ప్రసాద్, ఎస్‌.శ్రీనివాస్‌కు ఆత్మరక్షణ విద్య అంటే ఎంతో మక్కువ. వీరంతా కొత్తవలస మండలం ములగవాకవానిపాలెం గ్రామానికి చెందిన కరాటే మాస్టర్‌ బ్లాక్‌బెల్టు 5 వడాన్‌ రాష్ట్ర గుజూర్యూ ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు ములగపాక త్రినాథ్‌రావు శిష్యులు. చిన్నప్పటి నుంచి వీరంతా కోచ్‌ త్రినా«థ్‌ వద్ద కఠోర శిక్షణ తీసుకుంటున్నారు. కరాటేలో ఎల్లో బెల్టు నుంచి బ్లాక్‌ బెల్టుల వరకూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ బంగారు, వెండి, కాంస్య పతకాలను సాధిస్తున్నారు.

‘నరేంద్ర’జాలం
కొత్తవలస మండలం నిమ్మలపాలెంకు చెందిన ఎం.నరేంద్ర ప్రస్తుతం జిందాల్‌ భారతి విద్యామందిర్‌లో 9 తరగతి చదువుతున్నాడు. తండ్రి నారాయణరావు కిరాణా వ్యాపారి. జార్ఖండ్‌లో జరిగిన జపాన్‌ డిప్లమా బ్లాక్‌ బెల్ట్‌ పోటీల్లో నరేంద్ర మొదటి ఏఐకేఎఫ్‌ ఈస్ట్‌జోన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌–2017లో కాంస్య పతకం సాధించాడు. 2016 జాతీయస్థాయి ఏషియన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌ బంగారు, విశాఖపట్నం స్వర్ణభారతి, రాజీవ్‌గాంధీ స్టేడియాల్లో 2015లో జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో రెండు రజిత పతకాలను సాధించాడు.

భళా భరత్‌
వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామానికి చెందిన ఎన్‌.భరత్‌కుమార్‌ ప్రస్తుతం మంగళపాలెం సెయింటాన్స్‌లో 10 తరగతి చదువుతున్నాడు. అయిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే త్రినాథ్‌ శిక్షణలో రాటుదేరాడు. తండ్రి ఆటో డ్రైవర్‌. నిరుపేద కుటుంబానికి చెందిన భరత్‌కుమార్‌ జార్ఖండ్‌లో అంతర్జాతీయ జపాన్‌ డిప్లమా పోటీల్లో బ్లాక్‌బెల్టు, జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. 2015 ఏషియన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌లో బంగారు పతకం. 2016లో ఏపీ ఎంఎల్‌ఏ కప్, 12వ ఆల్‌ ఇండియా ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్, ఏసియన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పతకాలు సాధించాడు.

తాపీమేస్త్రి కొడుకు తారస్థాయికి..
చింతపాలెం గ్రామానికి చెందిన ఎస్‌.శ్రీనివాసరావు ప్రస్తుతం పెందుర్తి శ్రీగురు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. తండ్రి తాపీ పనులు చేస్తుంటాడు. శ్రీనివాసరావు 2016 జాతీయ ఏషియన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌లో రజతం, విశాఖపట్నం స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ పోటీలు, 2015లో జాతీయస్థాయిలో గాజువాకలో జరిగిన ఎంఎల్‌ఏ కప్‌ పోటీల్లో 2 బంగారు పతకాలు సాధించాడు. 14వ ఆల్‌ ఇండియా, 12 ఆలిండియా ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్, జార్ఖండ్‌లో జరిగిన జపాన్‌ డిప్లమా బ్లాక్‌బెల్ట్, మొదటి ఏఐకేఎఫ్‌ ఈస్ట్‌జోన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌–2017 పోటీల్లో కాంస్య పతకాలను సాధించాడు.

ఒలింపిక్‌ పతకమే ధ్యేయం
జర్మనీ, కెనడా, కొలంబోల్లో జరిగిన అంతర్జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం వచ్చినా ఆర్థిక స్తోమత చాలక, ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించక అవకాశం కోల్పోయాను. ఒలింపిక్స్‌లో పతకం సాధించటమే నా ధ్యేయం. అందుకే శిక్షణ ఇస్తున్నా. ప్రతి ఒక్కరూ.. ప్రదానంగా ఆడపిల్లలు ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలి. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో దాదాపు 16 వేల మందికి శిక్షణ ఇచ్చాను. ఏఐకేఎప్‌ లో రాష్ట్రంలో 5వ డాన్‌గా మెదటిసారిగా బ్లాక్‌బెల్టు తీసుకున్నాను.
– ఎం.త్రినాథరావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ గూజూర్యూ

పంచ్‌ కొడితే పతకమే
కొత్తవలస మండలం మునగపాకవానిపాలెం గ్రామానికి చెందిన ఎం.నీలాంజని ప్రసాద్‌ నరపాం కోస్టల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో జరిగిన కరాటే పోటీల్లో 2 బంగారు, 2 రజిత, 2 కాంస్య పతకాలు సాధించాడు. జపాన్‌ డిప్లమా బ్లాక్‌బెల్టు సాధించాడు. 2016లో విశాఖపట్నం స్వర్ణభారతి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి ఏషియన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో బంగారుపతకం, 2015లో రాజీవ్‌గాంధీ స్టేడియంలో జాతీయ స్థాయి, 2017 జార్ఖండ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కాంస్య పతకాలను సాధించాడు.

స్వర్ణాల సుధీర్‌
కొత్తవలస మండలం కోస్టల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న సుధీర్‌బాబు జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగిన అంతర్జాతీయ జపాన్‌ డిప్లమా పోటీల్లో పాల్గొని జపాన్‌ బ్లాక్‌ బెల్టు సాధించాడు. జార్ఖండ్‌లో జరిగిన మొదటి ఏఐకేఎఫ్‌ ఈస్ట్‌జోన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌–2017లో కాంస్య పతకం సాధించాడు. సౌత్‌ ఇండియా గుజూర్యూ కరాటే డో ఫెడరేషన్‌ అసోసియేషన్‌ మెదటి శిక్షణలో పాల్గొన్నాడు. ఏషియన్‌ షిప్‌లో బంగారు పతకం, 2016లో మొదటి ఆంధ్రప్రదేశ్‌ గుజూర్యూ కరాటే చాంపియన్‌ షిప్‌ ఎంఎల్‌ఏ కప్‌ బంగారు పతకం సా«ధించాడు. 2016లో నార్త్‌ ఆంధ్ర గుజూర్యూ కరాటే చాంపియన్‌షిప్‌ సాధించాడు. 2016లో 12వ ఆల్‌ఇండియా ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ హైపవర్‌ కప్‌లో బంగారు పతకం సా«ధించాడు. నేషనల్‌ స్పోర్ట్సు కరాటే డో కాస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ విజయనగరం జిల్లా కార్యదర్శిగా ఎంపికయ్యాడు.

మరిన్ని వార్తలు