అన్న పంచ్‌ విసిరితే మాస్‌ చెల్లి కిక్‌ కొడితే మటాష్‌

20 Aug, 2016 23:43 IST|Sakshi
అన్న పంచ్‌ విసిరితే మాస్‌ చెల్లి కిక్‌ కొడితే మటాష్‌
 
  • కరాటేలో రాణిస్తున్న అన్నా చెల్లెలు
  • జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణింపు
మల్కాపురం :క్రీడల్లో ప్రతిభ చాటుతున్న వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటిది ఒకే ఇంట్లో ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలతో దుమ్ముదులుపుతున్నారు. మల్కాపురం ప్రాంతానికి చెందిన జీవీఎన్‌ శేషు, జి.పద్మావతిలకు ఇద్దరు పిల్లలు. రేవంత్, నమ్రత. రేవంత్‌ఇంటర్‌ చదువుతుండగా..నమ్రత తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇద్దరూ కరాటేలో బంగారు,వెండి పతకాలతో సత్తాచాటుతూ వారెవ్వా అనిపిస్తున్నారు.
 రేవంత్‌ చిన్నతనం నుంచి సినిమాల్లో ఫైట్లు చూసి ఇంట్లో డిష్యూం డిష్యూం అంటూ తల్లిదండ్రులతో ఆడుకునేవాడు. క్రమంగా ఫైటింగ్‌పై రేవంత్‌కున్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు నగరంలో ప్రముఖ కరాటే శిక్షకుడు ఎం.సుందరం వద్ద చేర్పించారు. అప్పుడు రేవంత్‌ వయసు కేవలం తొమ్మిదేళ్లు. ఇక్కడ శిక్షణ తీసుకుని 2008లో తొలిసారిగా నగరంలో స్వర్ణభారతి స్టేడియం వద్ద జరిగిన కరాటే పోటోల్లో ప్రతిభ చూపి బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు. కేరళలో 2008 సంవత్సరంలో జరిగిన ఇంటర్నేషనల్‌ పోటీల్లో చక్కటి ప్రతిభ చూపి సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. 2011లో అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. అక్కడ నుండి అనేక పోటీల్లో తన ప్రతిభ చూపి అనేక మెడల్స్,సర్టిఫికెట్లు సాధించాడు.ఇంత వరకు రేవత్‌ 40 గోల్డు,20 సిల్వర్,22 బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించాడు.ఎంతో మంది ప్రముఖుల మన్నలను పొందాడు.
అన్నను చూసి..
తన అన్న కరాటేలో చూపుతున్న ప్రతిభకు స్ఫూర్తితో నమ్రత కూడా కరాటేపై మక్కువ పెంచుకుంది. అన్న చేరిన గురువు వద్దే శిక్షణ తీసుకుని సత్తాచూపుతోంది. ఏడో ఏటనే కరాటేలో చేరి అద్భుత ప్రదర్శన చూపి గురువుల మన్నలను పొందింది.నమ్రత కూడా అనేక పోటీల లో పాల్గొని పలు బహుమతులు సాధించింది. ప్రస్తుతం తోమ్మిదో తరగతి చదువుతున్న నమ్రత ఇంత వరకు 25 గోల్డు,16 సిల్వర్,20 బ్రాంజ్‌ మెడల్‌ సాధించింది. తమ ఇద్దరు పిల్లలు కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి పతకాలు తీసుకురాడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు