అన్ని రంగాల్లోనూ తెలుగు భాషను అమలు చేయాలి

15 May, 2017 23:12 IST|Sakshi
అన్ని రంగాల్లోనూ తెలుగు భాషను అమలు చేయాలి
పాశ్చాత్య ప్రభావంతో మాతృభాషకు ముప్పు
చిన్నారుల్లో తెలుగుపై మమకారం పెంచాలి
‘సాక్షి’తో కవి, రచయిత డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌
రాజమహేంద్రవరం రూరల్‌ : అమ్మ ఒడి లాంటి బడిలో నేర్చుకున్న మన మాతృభాషకు పాశ్చాత్య నాగరికత, సంస్కృతి వల్ల కొంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ప్రముఖ కవి, రచయిత, తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పాలన,  బోధన, జనజీవన రంగాల్లో తెలుగును పూర్తి స్థాయిలో అమలు చేసిననాడే న్యాయం జరుగుతుందని చెప్పారు. బొమ్మూరులోని తెలుగు యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తెలుగులోనే ప్రభుత్వ కార్యకలాపాలు జరపాలని, ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాల్లో తెలుగులోనే మాట్లాడాలనే నిబంధన తీసుకురావాలన్నారు. విద్యార్థి దశ నుంచే మాతృభాషపై మమకారం పెంచాలని, పర భాషను గౌరవించు..మాతృభాషను ప్రపంచానికి చాటి చెప్పు అనే నినాదాన్ని ప్రతి ఇంటికీ చేర్చాలని ఆయన సూచించారు. తెలుగు సాహిత్యంలో పరిశోధనలు కొనసాగాలన్నారు. 
భాష స్వరూపం మార్చేస్తున్నారు
ఆధునిక పోకడల పేరుతో మాతృభాష స్వరూప స్వభావాలను, రూపురేఖలను మార్చేస్తున్నారని ఆవేదన చెందారు. సామాజిక చైతన్యం కోరే దిశగా కవులు, రచయితలు తమ రచనలు కొనసాగించాలని కోరారు. కవిత్వంలో ప్రాసలు, యాసలు కన్నా సామాజిక ఇతివృత్తానికే ప్రాధాన్యత కల్పించాలన్నారు. కవిత్వం నేడు కొత్తదనం కోరుకుంటోందని చెప్పారు. సోషల్‌మీడియా, ఫేస్‌బుక్‌ మాధ్యమాల ద్వారా కవిత్వం రాసేవారు తయారుకావడం హర్షణీయమన్నారు. తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ సారథ్యంలో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసి, వందలాది మంది కవులను సత్కరించి ప్రోత్సాహిస్తున్నామన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లోని కవులు, రచయితలతో సంఘం ఏర్పాటు చేయనున్నట్టు ప్రతాప్‌ తెలిపారు.
మరిన్ని వార్తలు