నెరవేరిన ‘భగాయత్‌’ కల

4 Oct, 2016 23:38 IST|Sakshi
రైతులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, చిత్రంలో కేటీఆర్‌

సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్‌: నగరంలోని ఉప్పల్‌ భగాయత్‌ ప్రాంతంలో సాగు భూములు కోల్పోయిన బాధితుల ఎదు రు చూపులకు మోక్షం లభించింది. వారికి ల్యాండ్‌ ఫూలిం గ్‌ పద్దతిన ప్లాట్లను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రకటించారు. దసరా పండుగలోగా ఎకరాకు వెయ్యి గజాల చొప్పున హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన వెంచర్‌లో రైతులకు ప్లాట్లను కేటాయించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉప్పల్‌ భగాయత్‌ రైతులు సీఎంను తన అధికార నివాసంలో కలిశారు. వంశపారంపర్యంగా సాగు చేసుకుంటున్న తమ భూములను అసైన్‌మెంట్, సీలింగ్‌ పేరుతో గత ప్రభుత్వాలు తీసుకున్నాయని, తమకు పరిహారంగా ఎకరాకు వెయ్యి గజాల చొప్పున ప్లాట్లను కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చినట్లు వివరించారు. 11 ఏళ్లయినా హామీ అమలు కాలేదని సీఎం దృష్టికి తెచ్చిరు.

దీనిపై ఆయన స్పందిస్తూ రైతులకు ప్లాట్లు కేటాయించే ప్రక్రియను దసరా లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే అసైన్డ్‌ పట్టా భూములకు ఎకరాకు వెయ్యి గజాలు ఇస్తున్న నేపథ్యం లో.. సీలింగ్‌ భూములపై కూడా నిర్ణయం తీసుకున్నారు. సీలింగ్‌ ఎకరా భూమికి 600 గజాల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తుందని సీఎం ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు.

ఫలించిన పుష్కర నిరీక్షణ..
నాగోల్‌ సమీపంలో మూసీకి ఉత్తరాన రోడ్డుకు ఇరువైపుల 754 ఎకరాల రైతుల భూము, 54 ఎకరాల సీలింగ్‌ భూములను 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం సేకరించింది. ఇందులో మొత్తం 1,200 మంది రైతులు నష్టపోయారు.  ఇందుకుగాను రైతులకు హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన భూములను అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

అయితే కోర్టు కేసులు, సీలింగ్‌ వివాదాల కారణంగా కేటాయింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎంపీ మల్లారెడ్డితో పాటు టీఆర్‌ఎస్‌ నేతలు బేతి సుభాష్‌రెడ్డి, రామ్మోహన్‌గౌడ్, పలువురు కార్పొరేటర్లు, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.

కేటాయింపులు ఎలా..?
దసరాలోపు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తికావాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై అధికారులు దృష్టి సారించారు. దాదాపు 1200 మంది రైతులకు ప్లాట్లు కేటాయించాల్సి ఉండగా, ఎవరెవరికి ఎక్కడ, ఏ ప్రాతిపదికన కేటాయిస్తారోనని రైతుల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 15 ఎకరాలపై భూమిపై రైతులు కోర్టును ఆశ్రయించగా తీర్పు రావాల్సి ఉంది.

ఈ క్రమంలో ఈశాన్యం వైపు కొందరు రైతులు రోడ్లను మూసివేశారు. ఈ సమస్య పరిష్కారమైతే కేటాయింపులు సాధ్యపడతుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క కేటాయింపుల విషయంలో లాటరీ పద్ధతిని అవలంబించాలా? లేక మరో విధానాన్ని పాటించాలా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం నిర్వాసిత రైతులందరితో హెచ్‌ఎండీఏ అధికారులు శుక్రవారం సమావేశం కానున్నట్లు సమాచారం.



 

మరిన్ని వార్తలు