కేసీఆర్ ఫాంహౌస్ మీదుగా ‘భగీరథ’ తవ్వకాలు

13 Jan, 2016 04:56 IST|Sakshi
కేసీఆర్ ఫాంహౌస్ మీదుగా ‘భగీరథ’ తవ్వకాలు

సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో చేపట్టిన పైపులైన్ తవ్వకాల పనులు మంగళవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రంలోనూ కొనసాగాయి. గుర్తించిన సర్వే రూట్ ప్రకారం జగదేవ్‌పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామ పరిధిలోని సీఎం పంట భూముల్లో పైపులైన్ వేయాల్సి రావడంతో రైట్ ఆఫ్ వే చట్టం ప్రకారం పైపులైన్ వేస్తున్నట్లు కేసీఆర్‌కు సంబంధిత అధికారులు సమాచారం అందించారు. ఇందుకు ఆయన అంగీకరించారు. చట్ట ప్రకారం ఎవరి భూముల నుంచైనా పైపులైన్ వేసే అధికారం ప్రభుత్వానికి ఉందని చెప్పారు.

ముఖ్యమంత్రి కూడా దానికి అతీతుడు కాదంటూ అధికారులకు సహకరించారు. దీంతో దాదాపు 300 మీటర్ల పొడవున కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పైపులైన్ వేశారు. దీని నిర్మాణానికి సీఎం వ్యవసాయ భూముల్లో సాగవుతున్న అల్లం పంటను మూడు కుంటల మేరకు తొలగించాల్సి వచ్చింది. గోదావరి నది నుంచి నీటిని తెచ్చేందుకు శివారు వెంకటాపూర్ నుంచి వర్ధరాజ్‌పూర్, కొత్తపేట వరకు పైపులైన్ పనులు జరుగుతున్నాయి.

తెలంగాణ ప్రజలందరికీ మంచినీరు అందించే మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రైతులైనా, మరెవరైనా సరే సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. ఈ ప్రాజెక్టు తొలి విడతగా రాష్ట్రంలోని 10 నియోజకవర్గాలకు ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికే మంచినీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంతోపాటు మెదక్ జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, వరంగల్ జిల్లాలోని పాలకుర్తి, స్టేషన్ ఘన్‌పూర్, జనగామ, నల్లగొండ జిల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గాలకు తొలి విడతగా తాగునీటిని అందిస్తారు.

మరిన్ని వార్తలు