అరేయ్ వెంకటేశం.. మనోళ్లందరినీ తీస్క రారా

12 Jan, 2016 02:18 IST|Sakshi
అరేయ్ వెంకటేశం.. మనోళ్లందరినీ తీస్క రారా

చిన్ననాటి మిత్రులను ఆప్యాయంగా పలకరించిన కేసీఆర్   ఫాంహౌస్‌కు రావాలంటూ ఆహ్వానం
 దుబ్బాక: ‘‘అరేయ్ వెంకటేశం.. మన దోస్తులందరినీ ఫామ్‌హౌస్‌కు తీస్క రారా.. అందరం కలసి సమావేశమవుదాం... నాయి, మీయి సాదకబాధకాలపై మాట్లాడుకుందాం’ అంటూ తన చిన్ననాటి మిత్రుడైన బొమ్మెర వెంకటేశంను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. సోమవారం మెదక్ జిల్లా దుబ్బాకకు వచ్చిన ఆయన బాలాజీ దేవాలయంలో జరిగిన పూర్వ మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గురువులను, చిన్ననాటి మిత్రులను సీఎం కలుసుకున్నారు. చిన్ననాటి మిత్రులతో కేసీఆర్ గంటపాటు సమావేశమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో వారంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు.

 గురువులకు పాదాభివందనం
 చిన్నతనంలో తనకు పాఠాలు చెప్పిన గురువులకు సీఎం పాదాభివందనం చేశారు. పాఠశాల మిత్రులు, తన గురువులు.. ఇలా అందరినీ కలుసుకోవడం అపురూప ఘట్టమని సీఎం అన్నారు. తన క్లాస్‌మేట్ బొమ్మెర వెంకటేశం కనపడగానే ఆప్యాయంగా పలకరించారు. ‘బాగున్నావురా వెంకటేశ్...? పిల్లలేం చేస్తున్నరు? దోస్తులందరినీ నువ్వే ఫామ్‌హౌస్‌కు తీస్క రావాలె’ అని అన్నారు.  చిన్ననాటి మిత్రులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను ఉన్నానన్న విషయాన్ని మరిచిపోవద్దంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ గురువులు గన్నె బాల్‌రెడ్డి, మిత్రులు రాజయ్య, నల్ల నాగరాజం, వెంకట్రాములు, అమ్మన చంద్రారెడ్డి, వేణుగోపాల్‌రావు, గుండెల్లి వెంకట్‌రెడ్డి, గోవిందం, సాయి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
 
 పాఠశాలలో కలియతిరుగుతూ..
 ముఖ్యమంత్రి కేసీఆర్ దుబ్బాకలో తాను చదుకున్న పాఠశాలలో సోమవారం కలియతిరిగారు. చిన్ననాటి ఫొటోలను తిలకిస్తూ.. మిత్రులను పలకరిస్తూ మధురమైన గత స్మృతులను గుర్తుతెచ్చుకున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి దుబ్బాక వచ్చారు. తాను చదువుకున్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకోగానే పురోహితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ చిన్ననాడు చదివిన ప్రభుత్వ పాఠశాల, నూతనంగా నిర్మించే నమూనా భవనం, చిన్ననాటి తన ఫొటోలను కాసేపు తిలకించారు. అనంతరం దుబ్బాక బాలాజీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే సమీక్షా సమావేశానికి వెళ్లారు.

మరిన్ని వార్తలు