'కేసీఆర్ అసలు రంగు బయటపడింది'

25 Sep, 2015 20:58 IST|Sakshi
'కేసీఆర్ అసలు రంగు బయటపడింది'

ఖమ్మం: వరంగల్ జిల్లాలోని శ్రుతి, విద్యాసాగర్‌రెడ్డిల ఎన్‌కౌంటర్‌తో సీఎం కేసీఆర్ అసలు రంగు బయటపడిందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. ఖమ్మం పట్టణంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ప్రభుత్వంలో కూడా ఇటువంటి దారుణం జరగలేదని, అత్యాచారం చేసి, యాసిడ్ పోసి చంపడం ఘోరమన్నారు. ఎన్నికల ముందు కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఎన్నికల తర్వాత హామీని విస్మరించారన్నారు. వాళ్ల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువులు చదువుకోవచ్చునని, పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు మీడియంలో చదవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

ఇలాంటి పరిస్థితిలో పేద విద్యార్థులు సంపన్నుల కుమారులతో ఎలా పోటీపడతారన్నారు. క్షేత్రస్థాయి నుంచి ఉచితంగా ఇంగ్లిష్ విద్యను అందించాలని, అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేయాలన్నారు. అలాగే బడ్జెట్‌లో విద్యకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీపీఈఆర్‌ఎం రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ఖమ్మం జిల్లా నాయకులు ఉపేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు