బంగారు తెలంగాణకు పునరంకితం

28 Apr, 2016 03:16 IST|Sakshi

ఖమ్మం బహిరంగ సభలో సీఎం కేసీఆర్
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తృప్తి ముందు ఈ సీఎం పదవి ఏపాటిది?
తెలంగాణ ఆగం కావొద్దనే.. నేను నెత్తినెత్తుకున్నా
ప్రజలారా... మీ దీవెన కొనసాగించండి
నాకు నేనే ఒక ఆంక్ష విధించుకున్నా
ప్రతి ఇంటికి నల్లా నీరు తెస్తాన ని, లేదంటే ఓట్లడగమని చెప్పా
ఎంపీలు, ఎమ్మెల్యేల భవిష్యత్తును పణంగా పెట్టా
2017 నాటికి 95 % గ్రామాలకు నీరు 2019కల్లా రైతులకు 24 గంటల కరెంటు
పాలేరులో తుమ్మలను గెలిపించండి.. ఖమ్మం బంగారు గుమ్మం అవుతుంది

 
ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘‘నాకు ఇప్పుడు 63 ఏళ్ల వయస్సు. ఇంకా ఏం కావాలి? తెలంగాణను తెచ్చిన తృప్తి ముందు ఈ సీఎం పదవి ఏపాటిది? తెచ్చిన తెలంగాణ ఆగం కావొద్దు.. వేరే వారికి అప్పగిస్తే ఆగం అవుతుందని నెత్తిన ఎత్తుకున్న. అందరి సమస్యలు తీర్చే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఇల్లు కడితే కనీసం రెండు తరాల అవసరాలు తీరాలి. పేదల ఆత్మగౌరవాన్ని పెంచడానికే డ బుల్ బెడ్ రూం పథకం. అన్ని వర్గాల ప్రజల బాగు కోసం కృషి చేస్తున్నాం. మీ మద్దతు, దీవెన కొనసాగించండి’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. కష్టపడి రా ష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని, ప్రజల ఎజెండాయే టీఆర్‌ఎస్ ఎజెండా అని ఉద్ఘాటించారు. ‘ప్రజలే మా బాసులు.. రాష్ట్రం కల సాకారమైంది. ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పునరంకితం అవుతున్నాం’ అని పేర్కొన్నారు. బుధవా రం రాత్రి ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

నన్ను చూస్తే తప్పించుకొని పోయేవారు..
తెలంగాణ సమాజానికి ఒకటే మనవి. స్వప్నించే సాహసం ఉండాలి. డేర్ టు డ్రీమ్ అంటామే అది! తెలంగాణ కుమిలి, కునారిల్లుతున్న, అంతులేని దోపిడీ జరుగుతున్న సమయంలో పదవుల్లో ఉండి కుమిలిపోయా. పోరాడాలని చాలా మందితో చర్చించా. అయినా నిస్సహాయ స్థితి. కొందరైతే పదవులు పోవడం తప్ప రాష్ట్రం రాదు అనడం వినేవాణ్ని. 1996లోనే ఆదిలాబాద్‌కు వెళ్లినప్పుడు ఎస్సారెస్పీ కట్ట మీదనే కొందరు మిత్రులతో చెప్పా. ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేదని. తెలంగాణ ప్రాజెక్టు కాబట్టి శివాలయంలా ఉంది. ఆంధ్రా ప్రాజెక్టులు వైష్ణవాలయంలా ఉంటాయన్నా. ఎన్నడో ఒకనాడు తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారని అన్న. తెలంగాణ  ఉద్యమానికి నేనే నాయకత్వం వహిస్తానని కూడా చెప్పా. దేనికైనా సందర్భం రావాలి. పాపం పండాలి. శిశుపాలుడికి కూడా వంద తప్పుల దాకా అవకాశం ఇచ్చారు. ఇదే సమయంలో తెలంగాణ సమాజంపై విద్యుత్ చార్జీల భారం మోపారు.

బషీర్‌బాగ్ కాల్పులు కలచివేశాయి. అందుకే 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో ఉద్యమం ప్రకటించిన. చాలా మంది నన్ను చూస్తే తప్పించుకు పోయేవారు. ఎక్కడ నేను వారిని తెలంగాణ అంటూ విసిగిస్తానో అని. నాయిని నర్సింహారెడ్డి, మధుసూదనాచారి మరికొందరు నాయకులం కలిసి గులాబీ జెండా ఎగరేశాం. గతంలో ఉద్యమంలో పచ్చి మోసం జరిగింది. పదవులకు అమ్ముడు పోయారు. ప్రజలు నమ్మలేదు. వంద శాతం ఇంటికి ఒకరిని ఇవ్వండి తెలంగాణ సాధిస్తా అన్నా. ఉద్యమ బాట వీడనని ప్రజలకు మాటిచ్చా. నేను పెడదారుల్లో వెళితే రాళ్లతో కొట్టి చంపమన్న. పిడికెడు మందితో మొదలైన ప్రస్థానం అనేక కష్టనష్టాలు, అవమానాలు ఓర్చుకుని ముందుకు వెళ్లింది. ఈ బక్కోడు ఏమో చేస్తుండు. బొండిగ పిసికి చంపుతరు అన్నరు. 14 ఏళ్లలో కలను సాకారం  చేసుకున్నం. లక్ష్యాన్ని ముద్దాడాం.

అందరి రాజకీయ భవిష్యత్‌ను పణంగా పెట్టా
ఏ రాజకీయ నాయకుడైనా మాయ మాటలు చెబుతారు కానీ.. ఆంక్షలు విధించుకోరు. టీఆర్‌ఎస్‌కు ఉద్యమ సోయి ఉంది. ఒక ఆంక్ష నాకు నేనే విధించుకున్నా. ఎమ్మెల్యేలు, ఎంపీల భవిష్యత్‌ను పణంగా పెట్టా. ప్రతీ ఇంటికి నల్లా నీరు ఇస్తా.. లేదంటే ఎన్నికల్లో ఓట్లు అడగం అన్నా. మిషన్ భ గీరథ బృహత్తర పథకం. ఈ ఏడాది చివరినాటికి 6,200 గ్రామాలకు సాగునీరు అందిస్తాం. 2017 నాటికి 95 శాతం గ్రామాలకు నీరు అందుతుంది. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాం. అందుకే బడ్జెట్‌లో రూ.25,000 కోట్లు కేటాయించాం. రూ. 200 పెన్షన్ ఇచ్చి ఓట్లు గుద్దించుకున్నరు. అట్లా ఓట్లు గుద్ది గుద్ది ఇక్కడి దాకా వచ్చింది. రూ. వెయ్యి పెన్షన్ మేం ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేదు. డబుల్ బెడ్ రూం ఇళ్లెందుకు.. ఒక్క రూం ఉన్నవి చాలుగా అన్నారు కొందరు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక గది ఇంట్లో ఉంటారా? కాపురం చేస్తారా? అందుకే వాస్తవాలు చూసి నిర్ణయాలు తీసుకుంటున్నా. కరెంటు సమస్య తీరింది. ఇక తెలంగాణలో కరెంటు పోనే పోదు. 2019 నాటికి రైతులకు 24 గంటల కరెంటు ఇస్తాం.

తుమ్మలకు భారీ మెజారిటీ ఇవ్వండి
మూలాల్లోకి పోయి పనిచేస్తే తప్ప సమస్యలు తీరవు. ఎప్పుడైనా మంచి, న్యాయమే జయిస్తది. అందుకే రాష్ట్రంలో ఏ మూలన ఎన్నిక జరిగినా ప్రతిపక్షాలకు డిపాజిట్లు రాకుండా చేస్తున్నరు. ప్రజల పరిశీలన నిశితంగా ఉంటది. తుమ్మల నాకు ఆత్మీయ మిత్రు డు. 35 ఏళ్లుగా అనుబంధం. ఒకేసారి రాజకీయాలు ఆరంభించాం. తుమ్మల నాయకత్వంలో ఖమ్మం అభివృద్ధి చెందుతుంది. పాలేరు ప్రజలకు ఒక్కటే మనవి. తుమ్మలకు ఎమ్మెల్సీగా ఇంకా అయిదేళ్ల పదవీ కాలం ఉంది. ఎన్నికలయ్యాక కూడా రెండేళ్లు గడువు ఉంటుంది. క్రియాశీలకమైన నేత. ప్రజల మధ్య ఉండాలి. ఆయనను పాలేరుకు పంపించింది కేసీఆర్. కలిసొచ్చే అదృష్టాని కి నడిచొచ్చే కొడుకు పుడతాడట.

సీఎంకు కుడి భుజం, సీఎంకు సన్నిహితుడు. మంచి మెజారిటీతో గెలిపించండి. అయిదేళ్లలో ఊహించని విధంగా అభివృద్ధి చేసి చూపెడతం. మీపై నమ్మకం ఉంది. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు. బయ్యారం ఉక్కు .. తెలంగాణ హక్కు. కొన్ని ఇబ్బందులు ఉన్నా స్టీల్ ప్రాజెక్టు పెడతం. మణుగూరు విద్యుత్ ప్రాజెక్టు విజయవాడకు వె ళ్లింది. అందుకే భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టు చేపట్టాం. ఖమ్మం బంగారు గుమ్మం అయితది. బంగారు తెలంగాణకు పునరంకితం చేసుకుంటున్నాం.

మరిన్ని వార్తలు