‘అమరావతి’కి వెళ్తా...

21 Oct, 2015 08:46 IST|Sakshi
‘అమరావతి’కి వెళ్తా...

- మర్యాద మన సంస్కృతి: కేసీఆర్
- హెలికాప్టర్‌లో ఏపీ రాజధానికి వెళ్లనున్న సీఎం
 
సాక్షి, హైదరాబాద్, జగదేవ్‌పూర్: మనది మంచి సంస్కృతి అని.. మర్యాద ఇచ్చిపుచ్చుకునే ఉద్దేశంతోనే ఏపీ రాజధాని శంకుస్థాపనకు వెళుతున్నానని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ జిల్లాలోని ఎర్రవల్లిలో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా తన ఇంటికి వచ్చి ఆహ్వానించారని చెప్పారు. అమరావతి ఉత్సవాల్లో పాల్గొని అదేరోజు సాయంత్రం తిరిగి వస్తానని.. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి పునాదిరాయి వేస్తానని ప్రకటించారు.
 
 హెలికాప్టర్‌లో..: ‘అమరావతి’ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో వెళ్లనున్నారు. బుధవారం సాయంత్రమే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు వెళతారు. రాత్రికి అక్కడ మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసంలో బసచేస్తారు. గురువారం ఉదయం సూర్యాపేట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10.30 గంటల సమయంలో ‘అమరావతి’కి చేరుకుంటారు. ఆ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి సూర్యాపేటకు చేరుకుని... అక్కడ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం, మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే ఒక సభలో ప్రసంగించే అవకాశముంది.

మరిన్ని వార్తలు