మా పాలనకు ప్రజామోదం

20 May, 2016 02:18 IST|Sakshi
మా పాలనకు ప్రజామోదం

- పాలేరు ఫలితంపై సీఎం కేసీఆర్
- పార్టీలన్నీ ముఠా కట్టినా ప్రజలు మమ్మల్నే ఆశీర్వదించారు
- బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతాం

 
సాక్షి, హైదరాబాద్: ‘‘పాలేరు ఉప ఎన్నిక ఫలితం ప్రజలు ఆషామాషీగా ఇచ్చిన తీర్పు కాదు. రెండేళ్ల టీఆర్‌ఎస్ పాలనను పరిశీలించి, సమీక్షించి... మా విధానాలు కరెక్టంటూ వారు తెలిపిన ఆమోదం (ఎండార్స్‌మెంట్). ఇది మా పాలనకు ప్రజల ఆమోదం. మేమిదే పద్ధతిలో పనిచేయాలని, మీ వెంట మేమున్నామని.. ప్రజలు తేల్చి చెప్పారు. వారిచ్చిన ఈ అపురూపమైన తీర్పు మా బాధ్యతను మరింత పెంచింది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా అసత్య ప్రచారాలు, ఆరోపణలు మాని నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని హితవు పలికారు.
 
 ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక  ఫలితాలు వెలువడ్డాక గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పాలేరులో టీఆర్‌ఎస్ రికార్డు మెజారిటీతో అపురూపమైన విజయం సాధించింది.నియోజకవర్గ చరిత్రలో 1972లో వచ్చిన 25,452 ఓట్ల మెజారిటీ యే ఇప్పటిదాకా అత్యధికం. మా పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇప్పుడు ఏకంగా 45,682 ఓట్ల రికార్డు మెజారిటీ సాధించారు. విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు’’ అన్నారు. విజేతకు, విజయానికి పాటుపడ్డ పార్టీ శ్రేణులుకు అభినందనలు తెలిపారు. ఈ విజయం మరింత బాధ్యత పెంచిందన్న సీఎం, పొగరుకు పోవద్దని టీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. ‘‘ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఏకపక్షంగా గెలిపిస్తున్నరు. బ్రహ్మరథం పడుతున్నరు. ఈ ఫలితం ఇచ్చిన స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుతాం. నారాయణఖేడ్, పాలేరు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌వి. ఉప ఎన్నికల్లో వారి అభ్యర్థుల పట్ల సానుభూతి ఉండాలి.
 
 అయినా దాన్ని కూడా పక్కనపెట్టారు. సానుభూతి పవనాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించారు. అసాధారణ తీర్పు ఇచ్చారు. గత ఎన్నికలతో పోలిస్తే 24 రెట్లు ఓట్లు పెరిగాయి. దీన్ని ప్రజలిచ్చిన ప్రోగ్రెస్ రికార్డుగా భావిస్తున్నాం. వారు కోరుకున్న విధంగా ముందుకు పోతాం’’ అని స్పష్టం చేశారు. విపక్షాలు ఇప్పటికైనా అవాకులు, చవాకులు పేలడం మానాలని సూచించారు. ఇలాంటి మాటల వల్ల వారి గౌరవంతో  పాటు ప్రజల గౌరవం కూడా పోతోందన్నారు. తాము పూర్తి అవినీతిరహితంగా, పైరవీకారులకు అవకాశం లేకుండా పని చేస్తున్నామన్నారు.
 
 ప్రజల తీర్పునూ అవమానిస్తరా?
 విపక్షాల తీరుపై సీఎం ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘మా పార్టీ అధికారంలోకి వచ్చి, నేను సీఎం అయిన ఐదో రోజు నుంచే ఎవరికి వారుగా, సమూహంగా అర్ధసత్యాలతో ఆరోపణలు చేస్తున్నరు. తెలంగాణలో అవినీతిరహిత పాలన సాగుతోందని ప్రధాని సహా వివిధ సంస్థలు, అధికారులు కితాబిచ్చారు. విపక్షాలు మాత్రం ఉన్మాద దాడికి దిగుతున్నయి. అవినీతి జరుగుతోందంటరు. మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అంటరు. వ్యక్తిగత దాడికి దిగుతున్నరు. అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నరు’’ అంటూ విమర్శించారు. విపక్షాల ఆరోపణల్లో పసలేద న్నారు. చివరకు ప్రజల తీర్పునూ అవమానిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
 
 పాలేరు ఫలితంతోనైనా వారికి కనువిప్పు కలగాలన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని హితవు పలికారు. పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నానా యాగి చేసిందని, కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారులపైనా ఆరోపణలు చేసిందని, చివరకు ఓటింగ్ యంత్రాలను కూడా వివాదాస్పదంచేసిందని అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఉత్తమ అధికారిగా ఎన్నికల సంఘమే ప్రకటించిన లోకేశ్‌కుమార్ వంటి ఐఎఎస్ అధికారినీ శంకించారని, ఈ తీర్పు తర్వాత వారేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
 
 సిద్ధాంతాలు గాలికొదిలారు...
 అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో విపక్షాలు సిద్ధాంతాలను గాలికొదిలి మహాకూటమి కట్టారని, అన్ని పార్టీలూ కలసి పోటీ చేసినా టీఆర్‌ఎస్ ఏకంగా 20 వార్డులు గెలుచుకుందని సీఎం అన్నారు. పాలేరులోనూ ఇలాగే ముఠా కట్టారని ఆరోపించారు. అయినా కాంగ్రెస్‌కు అక్కడ గతంలో వచ్చిన ఓట్లు కూడా రాలేదన్నారు. ప్రజలు స్పష్టంగా ఉన్నారని, గుడ్డిగా కాకుండా ఆలోచించి ఓటేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘కాంగ్రెస్ ఇంకా 1947 నాటి పాలిటిక్స్ చేస్తోంది. ప్రభుత్వంపై పోరాటమేమిటి, హాస్యాస్పదం కాకపోతే! ప్రజా సమస్యలపై పోరాడండి. పంథా మార్చుకోండి’’ అని సూచించారు. రెండేళ్ల కాలంలో ఏడాది పాటు అధికారులే లేరు. విడిపోయిన ఏపీ సమస్యలు సృష్టిస్తూనే ఉంది. అనేక సమస్యలున్నాయి. ఉద్యోగుల పంపిణీ పూర్తి కాలేదు. కొందరు వారి రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు.
 
 ఏపీలో సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నరు. చంద్రబాబు ఢిలీల్లో మాట్లాడుతూ, రూ.60వేల కోట్ల ఆదాయం వచ్చే హైదరాబాద్‌ను వదులుకున్నామన్నడు. అంత ఆదాయమెక్కడిది? ఈసారి రాష్ట్ర బడ్జెట్‌లో కమర్షియల్ ట్యాక్సు ద్వారా రాష్ట్రమంతటా కలిపి విధించుకున్న పన్నుల వసూలు లక్ష్యమే రూ.42 వేల కోట్లు! ఇలాంటి అబద్ధాలు, అసత్యాల మీద రాజకీయాలు నడిచే కాలం పోయిం ది. ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉంటే వారి మద్దతుంటది. గుజరాత్ సీఎంగా నరేంద్ర మోదీ వరుసగా గెలిచారు. మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో సీఎంలు రెండోసారి గెలిచారు. మంచి పని చేస్తే ప్రజలు హత్తుకుంటున్నరు’ అని సీఎం పేర్కొన్నారు.
 
 దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రం
 రాష్ట్రంలో ఏమీ జరుగుతలేదని విపక్ష నేతలు తప్పుడు విమర్శలు చేస్తున్నారని సీఎం అన్నారు. ‘‘సంక్షేమంలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఉన్నం. మంత్రుల పేషీల దగ్గర ఎదురు చూపుల్లేకుండా, పైరవీలు, లంచాలు లేకుండా నిర్ణీత వ్యవధిలోనే 1,700 పరిశ్రమలకు టిఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులిచ్చినం. అమెజాన్, గూగుల్ వంటి ఐటీ దిగ్గజాల రెండో అతిపెద్ద క్యాంపస్‌లు మన రాష్ట్రంలోనే ఏర్పాటయ్యాయి. రాష్ట్రానికి ఫేస్‌బుక్ వచ్చింది. యాపిల్ వచ్చింది. ఈ ఏడాది రూ.68 వేల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులతో దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాం. మంచి పనులను అభినందించండి. నిర్మాణాత్మక సూచనలు చేయండి. స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నం. మీ వ్యూహాలు మార్చుకోండి’’ అని సూచించారు. విపక్షాలు నిర్మాణాత్మక పంథాలోకి వస్తాయని ఆశిస్తున్నామన్నారు.
 
 లక్ష్మణ్‌ది కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్న చందం
 కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రభుత్వంపై దాడి చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. ‘‘కేంద్రం కరువు నిధులిచ్చినా, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయడం లేదని లక్ష్మణ్ ఆరోపిస్తున్నరు. మరి తెలిసి మాట్లాడుతున్నరో, తెలియకనో అర్థం కావడం లేదు. కేంద్రం ఇచ్చింది కేవలం రూ.74 కోట్లే. రాష్ట్రం ప్రభుత్వం రూ.350 కోట్లు ఖర్చు పెడుతోంది. ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1,300 కోట్లు కావాలని కోరాం.
 
 కరువు సాయం పెంచాలని ప్రధానిని కోరాం. కరువు నుంచి శాశ్వతంగా బయట పడటానికి చేపట్టిన మిషన్ భగీర థ, మిషన్ కాకతీయ పథకాలకు సహకరించాలని, ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరాం. లక్ష్మణ్‌కు, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు సోయి ఉంటే రాష్ట్రానికి ఒక్కటన్నా కేంద్ర పథకం సాధించుకురావాలి. ఏమైతరో, ఏం పోతరో కానీ, 2019లో తామే ప్రత్యామ్నాయమంటున్నరు. మాపై విషం చిమ్ముతున్నరు’’ అంటూ దుయ్యబట్టారు.
 
 అవినీతి ఆరోపణలపై పరువు నష్టం దావా
 ‘మా ప్రభుత్వంపై ఇన్నాళ్లూ లేనిపోని ఆరోపణలు చేశారు. అవాకులు చవాకులు పేలారు. ఇకనైనా వ్యక్తిగత ఆరోపణలు, నిందలు మానుకోవాలి. ఇన్నాళ్లూ చూస్తూ ఊరుకున్నాం కానీ, ఇక ముందు కఠిన చర్యలు తీసుకుంటం. అనవసర విమర్శలు, వెకిలి ఆరోపణలు చేస్తే కేసులు పెడతం. పరువు నష్టం దావా వేస్తం. అవినీతి ఆరోపణలు చేస్తే రుజువు చేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ప్రయత్నిం చి పట్టుబడింది ఎవరో ప్రజలకు తెలుసు. అరకిరా పనులు చేసి అవాకులు, చవాకులు పేలితే బా గుండదు’ అంటూ విపక్షాలను సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

సినిమా

‘ఏమబ్బా, అందరూ బాగుండారా..’

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి

కరోనా.. కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’