కేంద్రీయ విద్యాలయాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి

5 Oct, 2016 23:19 IST|Sakshi
విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతున్న ఎంపీ రేణుకాచౌదరి
  • విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి
  • నూరుశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలి
  • రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి

  • ఖమ్మంరూరల్‌: జిల్లాలోని పోలేపల్లిలో గల కేంద్రీయ విద్యాలయాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని రాజ్యసభ​సభ్యురాలు రేణుకాచౌదరి అన్నారు. బుధవారం కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయంలో జరుగుతున్న విద్యాబోధన, వస్తున్న ఫలితాలను చూసి ప్రైవేటు పాఠశాలలు సైతం పోటీపడి నాణ్యమైన విద్యను అందిస్తున్నాయన్నారు. కేంద్రీయ విద్యాలయాలు అంటేనే పేద పిల్లలకు విద్యను అందించే విద్యాలయాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 2008లో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి జిల్లాకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించి జాతీయస్థాయిలో పేరు తెచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.  విద్యార్థులు తమకు ఇష్టం వచ్చిన కోర్సును అభ్యసించే విధంగా చూడాలన్నారు. నూరుశాతం ఫలితాల సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యాలయ అభివృద్ధికి తమ సహాయసహకారాలు ఎల్లాప్పుడూ ఉంటాయన్నారు. విద్యాలయ చైర్మన్‌ యాదగిరి మాట్లాడుతూ చిల్డ్రన్‌పార్క్‌, డిజిటల్‌ క్లాస్‌లు, అదనపు తరగతి గదులు అవసరం, ప్లేగ్రౌండ్‌ తదితర సమస్యలపై ఎంపీకి విన్నవించారు. ఈ సందర్భంగా గ్రానైట్‌ పారిశ్రామిక వేత్త రాయల నాగేశ్వరరావు విద్యాలయానికి 25 బెంచీలను ఇస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు విద్యాలయంలోని తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు. విద్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ ప్రిన్సిపాల్‌ కోయ సీతరామయ్య, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మానుకొండ రాధాకిషోర్‌, గిరిషాల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


     

మరిన్ని వార్తలు