జేసీకి మతిభ్రమించింది

12 Jan, 2017 23:56 IST|Sakshi
జేసీకి మతిభ్రమించింది

- సీమ ఫ్యాక‌్షన్‌కు జేసీ కుటుంబమే కారణం
- దివాకర్‌రెడ్డేమీ ఐఏఎస్‌ చదవలేదు
- ఘర్షణలతో కాదు.. రాజకీయంగానే ఎదుర్కొంటాం
- వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి


తాడిపత్రి : ‘ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి మతిభ్రమించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. గండికోట ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు సమక్షంలోనే సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడిన తీరును ప్రజలందరూ చూశారు. నేను చదువుకున్నది ఏడో తరగతి కాదు..పదో తరగతి వరకు చదివా. జేసీ ఏమీ ఐఏఎస్‌ చదవలేదు! చదివింది పీయూసీ (ఇంటర్‌)నే. ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాల’ని వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి హితవు పలికారు. గురువారం ఆయన తాడిపత్రిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జేసీ సోదరుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘చదువు మాత్రమే సంస్కారం నేర్పదు. ఏమీ చదువు లేకపోయినా అంజయ్య ముఖ్యమంత్రి కాలేదా? మా నాన్న సమితి అధ్యక్షులుగా పనిచేశారు.

నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. మీలా తెలంగాణ గద్వాల్‌ నుంచి ఇక్కడికి వలస రాలేదు.  అసలు రాయలసీమలో ఫ్యాక‌్షన్‌కు మూలం మీరే. తాడిపత్రి సమన్వయకర్తగా నేను రావడం ఇష్టం లేక ఏవేవో మాట్లాడుతున్నారు. దివంగత వైఎస్‌ రాజారెడ్డి, మా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే ఆర్హత మీకు లేదు. రాజారెడ్డిని హత్య చేసిన వారు కూడా నేడు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే..దీన్నిబట్టే వైఎస్‌ కుటుంబం ఔన్నత్యాన్ని తెలుసుకోండి. జేసీ సోదరుల నిజస్వరూపం ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతున్నారు. మేం రాజకీయంగానే వారిని ఎదుర్కొంటాం. ఘర్షణలతో కాద’ని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు రేపుతున్నారు. యల్లనూరు మండలంలోని  అన్ని గ్రామాల్లో గత ఆరు నెలలుగా కొందరికి వాహనాలు, డబ్బు సమకూర్చి ఫ్యాక‌్షన్‌ ప్రోత్సహిస్తున్నారు.

నా స్వగ్రామం తిమ్మంపల్లిలోనూ ఇల్లు కొని గొడవలకు ఆజ్యం పోయాలని చూస్తున్నారు. తాడిపత్రిలో ఇన్నాళ్లూ బెదిరింపు రాజకీయాలు చేశారు.  ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి హత్యలోనూ వారికి సంబంధం ఉంది. ఎమ్మెల్యేపై ఉన్న 32 కేసులే ఇందుకు నిదర్శనం. అందరి వద్దా బహిరంగంగానే చందాలు వసూలు చేస్తారు. ఎదురు తిరిగితే భయపెడతారు. పోలీసులతో తప్పుడు కేసులు కూడా నమోదు చేయిస్తార’ని విమర్శించారు. తన గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు.

చుట్టుపక్కల ఎన్ని పరిశ్రమలున్నా ఈ ప్రాంతంలోని  విద్యావంతులకు, కార్మికులకు ఉపాధి దొరకడం లేదన్నారు. జేసీ సోదరులకు కావాల్సినవి దక్కకపోతే పరిశ్రమల వద్ద ధర్నాలు కూడా చేస్తారు కానీ ఈ ప్రాంత ప్రజలను  మాత్రం పట్టించుకోరని విమర్శించారు. వారు చేసే దుర్మార్గాలను బయటపెడతామని, అరాచక రాజకీయానికి చరమగీతం పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాలెం వెంట్రామిరెడ్డి, పట్టణ, రూరల్, యూత్‌ కన్వీనర్‌లు కంచం రామ్మోహన్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, ఓబిరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు