జేసీ సోదరుల అండతోనే దీపక్‌రెడ్డి భూకబ్జాలు

16 Jun, 2017 22:10 IST|Sakshi
జేసీ సోదరుల అండతోనే దీపక్‌రెడ్డి భూకబ్జాలు

- జేసీ బ్రదర్స్‌ను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయాలి
- వైఎస్సార్‌సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి  డిమాండ్‌


అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి- తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అండతోనే అల్లుడు గుణపాటి దీపక్‌రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని వైఎస్సార్‌సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేసీ సోదరులు అధికారులను బెదిరించి తమ పనులు చేయించుకుంటారని, మాట వినని వారిపై దౌర్జన్యాలకు సైతం పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.

ప్రజలకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారన్నారు. అనంతపురంలోని టవర్‌క్లాక్‌ వద్ద ప్లాస్టిక్‌ కవర్లు విక్రయిస్తున్నావంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఓ మార్వాడిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కొడితే పోలీసులు చోద్యం చూశారే తప్ప ఏమీ చేయలేకపోయారన్నారు. సామాన్య ప్రజలు ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్రంగా పరిగణించే పోలీసులు.. ఇలాంటి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం పచ్చచొక్కా వేసుకుంటే ఇష్టమొచ్చినట్లు వ్యవహరించవచ్చనే ధోరణితో ప్రవర్తిస్తున్నారన్నారు. ‘అధికారం’ ముసుగులో ఎంతటి అరాచకాలకైనా పాల్పడవచ్చనే సంకేతాన్ని ప్రజలకు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ‘చందాలు అడగరాదు’ అంటూ జేసీ సోదరులు తమ ఇంటి వద్ద పెద్ద పెద్ద బోర్డులు వేసుకున్నారన్నారు.

అయితే అవి తమకు వర్తించవన్నట్టు గత ఏడాది అమ్మవారి గుడి కోసం, ఈ ఏడాది సాయిబాబా ఆలయం నిర్మాణం కోసం చందాలు వసూలు చేస్తున్నారన్నారు. వాటితో తమ కుటుంబం మాత్రమే సస్యశ్యామలంగా ఉండాలని వారు కోరుకుంటున్నారని విమర్శించారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ అందులో ఉద్యోగాల గురించి మాత్రం తమను అడగవద్దని చెప్పి నిరుద్యోగులను నిరుత్సాహానికి గురి చేస్తున్నారన్నారు. జేసీ సోదరులను ప్రజలు భయంతో గౌరవిస్తున్నారే తప్ప భక్తితో కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అధికారులపై దురుసుగా ప్రవర్తించడం, వారిపై దాడులకు పాల్పడడం వారికి అలవాటైపోయిందన్నారు. జేసీ సోదరులను టీడీపీ నుంచి సస్పెండ్‌ చేసి, శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి కుమ్మరి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు