రాయలు హత్య కేసులో కీలక ఆధారాలు

4 Apr, 2016 19:54 IST|Sakshi
రాయలు హత్య కేసులో కీలక ఆధారాలు

పోలీసుల అదుపులో నిందితుడు నవీన్ మురళీ
హత్యకు ప్లాన్ చేసింది ఒకరు, హత్య చేసింది నలుగురు
రాయలు హత్య కేసులో తెరపైకి వచ్చిన ప్రభు అనే వ్యక్తి పేరు
రాయలు హత్యకు నిరసనగా ఎల్లుండి న్యాయవాదుల విధుల బహిష్కరణ
రాయలు మృతిపై కాపు నేతల దిగ్ర్భాంతి

ఏలూరు:
ప్రముఖ న్యాయవాది, కాపు నేత టీడీ రాయలు హత్య కేసులో కీలక ఆధారాలు లభించినట్టు పోలీసులు వెల్లడించారు. రాయలు హత్యకేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు నవీన్ మురళీని తమదైన శైలీలో విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాయలు హత్యకు ప్లాన్ చేసింది ఒకరైతే.. హత్య చేసింది నలుగురు అని పోలీసులు నిర్థారించారు. అయితే రాయలు హత్యకేసులో ప్రభు అనే వ్యక్తి పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఓ ప్రముఖ నటుడికి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రభుపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ప్రభు తమ్ముడు నవీన్ మురళీని విచారించడంతో తన అన్నయ్య ప్రభు పాత్ర ఉన్నట్టు పోలీసులకు వెల్లడించాడు. దాంతో పరారీలో ఉన్న ప్రభుతోపాటు మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలు హత్యకు నిరసనగా ఎల్లుండి న్యాయవాదులు విధులు బహిష్కరించనున్నారు. రాయలు మృతిపై కాపు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం టీడీ రాయలు అనే న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఆయనను నరికి చంపారు. స్థానికంగా ఉన్న గాంధీ స్కూల్ సమీపంలోని ఏసీ పరికరాలు విక్రయించే షాపులో రాయలు ఉండగా కాపు కాసిన దుండగులు ఒక్కసారిగా షాపులోకి దూసుకువచ్చి వేటకొడవళ్లతో దాడి చేశారు. రాయలు ఏలూరు పట్టణంలో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. రాయలు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు