జిల్లాలో ఖాదీ అభివృద్ధికి చర్యలు

23 Oct, 2016 22:53 IST|Sakshi
జిల్లాలో ఖాదీ అభివృద్ధికి చర్యలు

 కడప రూరల్‌ : జిల్లాలో ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీ కమిషన్‌ సౌత్‌ ఇండియా రీజియన్‌ వైస్‌ చైర్మన్‌ చంద్రమౌళీ అన్నారు. ఆదివారం స్థానిక భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టే చర్యల్లో భాగంగా రాయలసీమ వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించినట్లు తెలిపారు. ఆ మేరకు వైఎస్సార్‌ జిల్లాలోని ప్రొద్దుటూరు, జమ్మలమడగు తదితర ప్రాంతాల్లో పర్యటించామన్నారు. జిల్లాలోని పులివెందుల తదితర ప్రాంతాలలో అరటిపంటలు విస్తారంగా ఉన్నాయన్నారు. అరటి కాండంతో ఫ్యాబ్రిక్‌ కుటీర పరిశ్రమ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పులివెందులలో రూ. 3 కోట్లతో కుటీర పరిశ్రమను ఏర్పాటు చేస్తామన్నారు. అందుకుగాను ఆ ప్రాంత రైతాంగంతో డిసెంబరులో అవగాహన సదస్సులు చేపడతామన్నారు. అలాగే ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లో ప్రత్యేకమైన అభివృద్ధికి చర్యలు చేపట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కాగా, జిల్లాలో ఎనిమిది ఖాదీ సొసైటీలు ఉన్నాయని, వీటిని మరింతగా పెంచి ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఇన్‌చార్జి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకుడు శ్రీనివాసులునాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివారెడ్డి, నగర అధ్యక్షుడు విజయనరసింహులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బత్తల పవన్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు