ఆదుకుంటాడనుకుంటే..

22 Aug, 2016 23:26 IST|Sakshi
ఆదుకుంటాడనుకుంటే..
  • అనంతలోకాలకు వెళ్లాడు!
  • ఖమ్మం ప్రమాద మృతుడు అజారుద్దిన్‌ తండ్రి ఏఎస్సై రఫీ
  • మార్కాపురం : ఉన్నత చదువులు చదివి వృద్ధాప్యంలో ఆదుకుంటాడనుకుంటే దేవుడు ఇలా అన్యాయం చేశాడంటూ ఖమ్మం రోడ్డు ప్రమాద మృతుడు ఎంటెక్‌ విద్యార్థి అజారుద్దీన్‌ తండ్రి యర్రగొండపాలెం ఏఎస్సై రఫీ కన్నీటిపర్యంతమవుతున్నారు. సోమవారం రాత్రి ఆయన సాక్షితో మాట్లాడారు. ఎంటెక్‌ త్వరలో అయిపోతోందని, మంచి ఉద్యోగం వస్తుందని, అందరినీ బాగా చూసుకుంటానని కొడుకు తరచూ చెప్పాడని, దేవుడు తన కుటుంబానికి అన్యాయం చేశాడని రఫీ ఆవేదన వ్యక్తం చేశారు.
     
    ఏఎస్సై రఫీ మార్కాపురంలోనే విద్యాభ్యాసం చేశారు. కానిస్టేబుల్‌గా, హెడ్‌ కానిస్టేబుల్‌గా ఈ ప్రాంత వాసులకు చిరపరిచితుడు. సోమవారం రోడ్డు ప్రమాదంలో రఫీ కుమారుడు మరణించాడన్న వార్త టీవీల్లో తెలుసుకున్న మిత్రులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. తర్లుపాడు రోడ్డులో నివాసం ఉంటున్న రఫీ బంధువులు, అజారుద్దీన్‌ మిత్రులు మొదట ఈ వార్తను నమ్మలేకపోయారు. ఇటీవలే అజారుద్దీన్‌ మార్కాపురం వచ్చి కుటుంబ సభ్యులతో గడిపి వెళ్లాడు. రఫీకి ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు బీఎస్సీ, మూడో కుమారుడు అగ్రికల్చర్‌ బీఎస్సీ చదువుతున్నాడు. బంధువుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
మరిన్ని వార్తలు