సాదాసీదాగా జడ్పీస్థాయీ సంఘాల సమావేశం

7 Aug, 2016 23:28 IST|Sakshi
స్థాయీ సంఘాల సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీచైర్‌ పర్సన్‌
  • వ్యవసాయం,విద్య,వైద్యం,ట్రాన్స్‌కో,ఇంజనీరింగ్‌ అంశాలపై చర్చ
  • వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 284 కోట్లతో ప్రతిపాదనలు
  • జెడ్పీ ఆమోదానికి  ప్రతిపాదనలు సిద్ధం
  • వివిధ అంశాలపై సమస్యలను లేవనెత్తిన జెడ్పీటీసీ సభ్యులు
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌ : జిల్లా పరిషత్‌ స్థాయి సంఘాల సమావేశాలు సాదాసీదాగా ముగిశాయి. ఆదివారం చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత అధ్యక్షతన జెడ్పీ ఆవరణంలో గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, పనులు, ఆర్థిక కమిటీలపై చర్చ జరిగింది. అలాగే వ్యవసాయం  కమిటీ సమావేశం వైఎస్‌ చైర్మన్‌ బరపాటి వాసుదేవరావు,సాంఘిక సంక్షేమం అసావత్‌ లక్ష్మి, స్త్రీ, శిశు సంక్షేమం తోటమళ్ల హరిత అధ్యక్షతన జరిగాయి. 2016–17 మార్చి ఆర్థిక సంవత్సరానికి  రూ. 284 కోట్లతో చేపట్టనున్న పనులకు ప్రతిపాదనలు చేశారు. ఇందులో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, జిల్లా పరిషత్‌ ఆధీనంలో ఉన్న వ్యవసాయం, ఫిషరీస్, గృహనిర్మాణం, సోషల్‌వెల్ఫేర్‌ శాఖల నుంచి కూడా ప్రతిపాదనలు చేశారు. జెడ్పీ జనరల్‌ ఫండ్‌ నుంచి రూ. 6 కోట్లు, సోషల్‌ వెల్ఫేర్‌ నుంచి రూ. 2 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా రోడ్ల అభివృద్ధికి రూ .143 కోట్లు అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల నుంచి రూ. 14 కోట్లు, ఆర్‌డబ్ల్యూస్‌ నుంచి రూ. 93 లక్షలు, ఉద్యోగుల, సభ్యుల గౌరవ వేతనాలకు రూ. 19 కోట్లు, గృహనిర్మాణ శాఖ ద్వారా రూ. 20 కోట్లు, శిక్షణ కోసం రూ .57.కోట్లు, ఫిషరీస్‌ ద్వారా రూ. 3.90 లక్షలు, వ్యవసాయం నుంచి రూ. 3.5 లక్షలతో ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలను జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమోదించాల్సి ఉంది.సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు పలు సమస్యలపై అధికారులను అడిగారు. కోఆప్షన్‌ సభ్యుడు జియాఉద్దీన్‌ మాట్లాడుతూ రైతులను పత్తిపంట సాగు వద్దని అధికారులు చెప్పడంతోనే వారు ఇతర పంటలను సాగు చేస్తున్నారన్నారు.అయితే పత్తి ధరలు అధికంగా ఉండటంతో పరిస్థితులు మారే అవకాశాలు ఉన్నాయన్నారు. దీనికి జేడీఏ మణిమాలా సమాధానమిస్తూ రైతులకు సంబంధించిన వ్యవసాయ పథకాలు అమలవుతున్నాయని,రైతులు రుణాలను రీ షెడ్యూల్‌ చేసుకోవాలన్నారు. కూసుమంచి జెడ్పీటీసీ రాంచంద్రునాయక్‌ మాట్లాడుతూ డ్రిప్‌ ఇరిగేషన్‌ పైపులు బ్లాక్‌ అవుతున్నాయని తెలుపగా ఏడాదికోసారి  వాటికి ఆసీడ్‌ ట్రీట్‌మెంట్‌ చేయించాలని అధికారులు తెలిపారు.చర్ల జెడ్పీటీసీ తోటమళ్ల హరిత అధ్యక్షతన జరిగిన స్త్రీ, శిశు  సంక్షేమం కమిటీ సమావేశలో అంగన్‌వాడీల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని,ఆయాలు, టీచర్లు సమయపాలన పాటించాలని ఆమె సూచించారు.అసావత్‌ లక్ష్మి అధ్యక్షతన జరిగిన సాంఘికS సంక్షేమం సమావేశంలో నిరుపేద దళితులకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు సక్రమంగా అందించాలన్నారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, షాదీముబారక్‌ పథకం ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చాలన్నారు.పలు ప్రభుత్వ పాఠశాలల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు నిరుపయోగంగా ఉన్నాయని కొత్తగూడెం జెడ్పీటీసీ పేర్కొన్నారు. దీనికి స్పందించిన చైర్‌పర్సన్‌ కొత్తగూడెంతో పాటు మధిర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు కూల్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయాలని డీఈఓ రాజేష్‌ కు సూచించారు.దోమల నివారణకు ఐఆర్‌ఎస్‌ స్ప్రే చేయడం లేదని కొద్ది రోజులు మాత్రమే చల్లి నామా మంత్రంగా ముగిస్తున్నారని కోఆప్షన్‌ సభ్యుడు మౌలానా ఆరోపించారు. దీంతో 90 రోజులు స్ప్రే చేయాలంటే రూ. కోటి 50 లక్షల అవుతుందని డీఎంహెచ్‌ఓ సమాధానం ఇవ్వగా మ్యాన్‌ పవర్‌కు రూ. 45 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారని, మందును నేరుగా గ్రామాలకు ఇస్తే కార్యదర్శులు చెల్లిస్తారని సభ్యులు పేర్కొన్నారు.ప్రస్తుతం స్థలాలు ఉన్నా నిధులు లేక జిల్లాలో అంగన్‌వాడీలు అసంపూర్తిగా ఉన్నాయని బోనకల్లు జెడ్పీటీసీ బాణోత్‌ కొండా పేర్కొన్నారు.రఘునాథపాలెం జెడ్పీటీసీ బాణోత్‌ వీరూనాయక్‌ మాట్లాడుతూ పంచాయతీ భవనాలకు ప్రభుత్వం రూ. 13 లక్షలు మంజూరు చేశారని,భవనాల ఖర్చు మాత్రం రూ.18 లక్షలు అయ్యే పరిస్థితి ఉందని దీంతో అసంపూర్తిగా ఉన్నాయని సర్పంచ్‌లు సెక్రటరీలు పనిచేసేందుకు గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేవన్నారు.వైరా రిజర్వాయర్‌కు ట్యాంక్‌ బండ్‌ నిర్మాణం చేపట్టేందుకు రూ. 9 కోట్లు ప్రతిపాదనలు చేశారని,ఇప్పటి వరకు నిధులు మంజూరి కాలేదని వైరా జడ్పీటీసీ బొర్రా ఉమాదేవి పేర్కొన్నారు. ఆనకట్ట సైతం దెబ్బతిందని వెంటనే ట్యాంక్‌బండ్‌ నిర్మాణం చేపట్టాలన్నారు. మణుగూరు జెడ్పీటీసీ దుర్గ మాట్లాడుతూ మండల పరిధిలో రేషన్‌ సక్రమంగా ఇవ్వటం లేదని రెండుషాపులకు ఒకే ఇన్‌చార్జి ఉండటంతో ఆరు రోజులు మాత్రమే రేషన్‌ ఇస్తున్నారని, దీంతో ప్రజలకు రేషన్‌ అందటం లేదని పేర్కొన్నారు.

     

>
మరిన్ని వార్తలు