ఖరీఫ్ సాగులో రైతులు బిజీ

14 Aug, 2016 19:16 IST|Sakshi
ఖరీఫ్ సాగులో రైతులు బిజీ

  సదాశివపేట రూరల్‌:రెండేళ్లుగా వర్షాలు లేక తీవ్ర కరువుతో సతమతమైన రైతులు ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా  కురవటంతో  మండలంలోని రైతులు ఖరీఫ్‌ సాగులో బిజీగా ఉన్నారు. పొలాలు, పత్తి చేలల్లో గుంటుక, పిచికారీ, కలుపుతీత పనుల్లో నిమగ్నమయ్యారు. ఖరీఫ్‌ మొదలై రెండు మాసాలు గడుస్తున్న నేపథ్యంలో పంటల సంరక్షణ చర్యల్లో భాగంగా రైతులు పంటలను కంటికి రెప్పల్లా కాపాడుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కుగాను  మండలంలోని రైతాంగం పత్తిని ఎక్కువగా సాగు చేస్తుండగా మిగతా పంటలను మోస్తరుగానే సాగు చేస్తున్నారు.

మండలంలో వరి 220 హెక్టార్లు, పత్తి 8900 హెక్టార్లు, మొక్కజొన్న 350, పెసర 380, కంది 800, సోయాబీన్‌ 450, మినుము 290, ఇతర పంటలు 1500 హెక్టార్లలో సాగు చేశారు. మొత్తం కలిపి మండలంలో 12890 హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. మన తెలంగాణ మన వ్యవసాయం సదస్సులో వ్యవసాయ అధికారులు రైతులకు పత్తికి ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు సాగు చేసుకోవాలని సూచించినా రైతుల్లో మార్పు కనిపించలేదు.
వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నం..
ఖరీఫ్‌ వరుసగా వర్షాలు కురస్తుండటంతో రైతులు పంటల సాగు, సస్యరక్షణచర్యల్లో బిజీగా ఉన్నారు. పత్తి, మొక్కజొన్న, కంది పంట చేనులు కలుపుతీతకు వచ్చాయి. దీంతో రైతులు కూలీలతో కలుపు పనులు చేయిస్తున్నారు. కలుపు పనుల కారణంగా గ్రామాల్లో కూలీలకు డిమాండ్‌ పెరిగింది. కొందరు రైతులు పక్క గ్రామాల్లోని కూలీలను అదనంగా డబ్బుల చెల్లించి మరీ వ్యవసాయ పనులు చేయించుకుంటున్నారు. మొదట పత్తి విత్తనాలు విత్తే సమయంలో కూలీ ఒక్కక్కరికి రూ.250 వరకు చెల్లించారు.

ఇప్పుడు కలుపుతీత పనులకు సైతం రైతులు అంతేమొత్తం కూలీలకు చెల్లించాల్సివస్తోంది. కొందరు రైతులు కలుపు తీయిస్తుంటే మరికొంత మంది పొలంలో గుంటుక తొలుతున్నారు. చేలల్లో కలుపు పూర్తయిన రైతులు పంటకు యూరియా, డీఏపీ లాంటి ఎరువులను చల్లే పనిలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటి వరకు మండలంలో 40 శాతం వరినాట్ల పనులు పూర్తి కాగా ఇంకా 60 శాతం నాట్లు వేయాల్సి ఉంది.

ఇంతవరకు వరినాట్లు వేయని రైతులు ఈనెల మూడో వారంవరకు నాట్లు వేసుకోవచ్చు. నాటు వేసుకోవటం ఆలస్యమైతే వరి పంట దిగుబడి తగ్గే అవకాశాలు ఉంటాయి. రైతులు త్వరగా వరి నాట్లు వేసుకోవాలి.
-మూడో వారం వరకు నాట్లు వేసుకోవచ్చు  బాబూనాయక్‌, ఏఓ

మరిన్ని వార్తలు