కిక్కు.. రోడ్డు దిగాల్సిందే!

30 Jun, 2017 23:20 IST|Sakshi
కిక్కు.. రోడ్డు దిగాల్సిందే!
- నేటి నుంచి కొత్త మద్యం పాలసీ
– జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన దుకాణాలు 167, బార్లు 17
– సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించాలంటున్న అధికారులు 
– మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్స్‌(ఎండీఆర్‌)గా మార్పు కోసం ఎదురుచూపులు 
   
కర్నూలు: జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం దుకాణాలను జులై 1వ తేదీ నుంచి(శనివారం) నిర్ణీత దూరంలో ఏర్పాటు చేయాల్సిందే. ఈ మేరకు ఎక్సైజ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నూతనంగా లైసెన్స్‌ పొందిన వ్యాపారులు శనివారం నుంచి దుకాణాలు ప్రారంభించనున్నారు. వారు సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటించాలి. రూ.20 వేల లోపు జనాభాఉన్న ప్రాంతాల్లో రహదారికి 220 మీటర్ల దూరంలో దుకాణాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుందన్న ఆశతో పాత వ్యాపారులు ఎదురు చూస్తున్నారు.
 
జిల్లాలోని నగర/పట్టణాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులను మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్స్‌(ఎండీఆర్‌)గా మార్పునకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అది అమలైతే జాతీయ, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో దుకాణాలను కొనసాగించవచ్చునన్న ఆశతో పాత వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో రహదారికి 500 మీటర్ల దూరంలో దుకాణం ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  కర్నూలు డివిజన్‌లో 86, నంద్యాల డివిజన్‌లో 81 కలిపి 167 మద్యం  దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్నట్లు గుర్తించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వాటన్నింటినీ తొలగించాల్సిందే. అయితే మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్స్‌గా మార్పు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నందున దుకాణాలు అక్కడే కొనసాగించేందుకు అవకాశం వస్తుందని 80 శాతం మంది వ్యాపారులు చివరి రోజు రాత్రి వరకు ఎదురుచూస్తున్నారు. అలాగే జిల్లాలో పాతవి 35 బార్లు ఉండగా, నంద్యాలలో 15కు గాను రెండు రోడ్‌సైడ్, కర్నూలులో 18కి గాను 12 రోడ్‌సైడ్‌ ఉన్నట్లు గుర్తించారు. వారంతా కూడా చివరిగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తుండటంతో కొత్త దుకాణాల ఏర్పాటు గందరగోళంగా మారింది.  
  
ఎంఆర్‌పీ అమలయ్యేనా?
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు గరిష్ట చిల్లర ధర కంటే అదనపు ధరకు మద్యం విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నెల రోజుల క్రితం వరకు సీసాపై రూ.20 వరకు అదనంగా దోపిడీ చేశారు. జూలై 1 నుంచి ఏర్పాటు కానున్న కొత్త దుకాణాల ఫీజులు భారీగా తగ్గనున్నాయి. ఈసారైనా మద్యం వ్యాపారులు ఎంఆర్‌పీకి విక్రయిస్తారా లేక మళ్లీ సిండికేట్ల రూపంలో అదనపు ధరలతో దోచుకోవడం మొదలు పెడతారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.  
 
మరిన్ని వార్తలు