తణుకులో కిడ్నాప్‌ కలకలం

4 Jan, 2017 02:50 IST|Sakshi
తణుకు : తణుకు వెంకటేశ్వర థియేటర్‌ సెంటర్‌ వద్ద మంగళవారం మధ్యాహ్నం కిడ్నాప్‌ కలకలం రేగింది. అక్కడ ఆగి ఉన్న కారులోంచి  ఓ మహిళ దూకి పరుగులుపెట్టడం, ఆమె  వెంట ఉన్న వారు పట్టుకుని కారులో కూర్చోబెట్టి తాళ్లతో కట్టడాన్ని చూసిన  స్థానికులు ఎవరో మహిళను కిడ్నాప్‌ చేస్తున్నారని భావించి అడ్డగించారు. విషయం ఒక్కసారిగా దావానంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మహిళను,  కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. మీడియా ప్రతినిధులు పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే ఆ మహిళకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆసుపత్రి నుంచి తీసుకెళ్తున్న క్రమంలో ఇదంతా జరిగిందని తేలడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
మానసిక స్థితి సరిగా లేకే..
నిడదవోలు మండలం తాళ్లపాలెంకు చెందిన ప్రతిమాదేవి తమిళనాడు తంజావూరులో తన కొడుకు సంతోష్‌ వద్ద ఉంటోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభిమాని అయిన ఆమె జయ మరణం తర్వాత మానసిక రోగిగా మారింది. జయలలిత మరణంపై విచారణ చేయించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు గతంలో యత్నించింది. దీంతో  ఇటీవల ఆమెను స్వగ్రామానికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చి తిరిగి తీసుకెళ్లే క్రమంలో వెంకటేశ్వర థియేటర్‌ సెంటర్‌ వద్ద పండ్లు కొనేందుకు ఆగారు.
 ఇదే సమయంలో కారు డోరు తీసుకుని మహిళ పారిపోయేందుకు యత్నించడంతో ఆమె అరవడం,  కారుపై అన్ని పార్టీలకు చెందిన స్టిక్కర్లు, వాహనంలో తాళ్లు ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అడ్డగించారు. దీంతో పోలీసులు వచ్చి ప్రతిమాదేవితోపాటు ఆమెతోపాటు ఉన్న  కొడుకు సంతోష్, సోదరి మల్లికాదేవిలను పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిని ఎస్సై జి.శ్రీనివాసరావు విచారించారు. ఆమెకు మానసికస్థితి సరిగా లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. 
 
మరిన్ని వార్తలు