మాజీ ఎమ్మెల్యే కాటసానిపై కిడ్నాప్ కేసు

11 Apr, 2016 04:25 IST|Sakshi
మాజీ ఎమ్మెల్యే కాటసానిపై కిడ్నాప్ కేసు

కర్నూలు: పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది.  గణేష్ నగర్‌కు చెందిన వహీద్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడవ పట్టణ పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజ్‌బాగ్ వీధి(స్విమ్మింగ్‌పూల్ పక్కన)లో నివాసం ఉంటున్న అజీజా జలీల్‌కు ఇద్దరు సంతానం. మొదటి కుమారుడు వహీద్ గణేష్‌నగర్‌లో, మరో కుమారుడు జావీద్ రాజ్‌బాగ్ వీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి బళ్లారిలో ఖరీదైన 40 సెంట్ల స్థలం ఉంది. దానికి సంబంధించి బంధువులు వాటా కోసం కోర్టుకు వెళ్లారు.

దీంతో ఖర్చుల నిమిత్తం అజీజా జలీల్ కాటసాని రాంభూపాల్ రెడ్డి దగ్గర ఏడేళ్ల క్రితం రూ.7 లక్షలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించలేదు. కోర్టు వివాదం పూర్తి అయి బళ్లారిలో స్థలం వీరికే దక్కింది. అప్పు కింద బళ్లారిలో ఉన్న స్థలాన్ని రాసి ఇవ్వాలని కాటసాని ఒత్తిడి తెచ్చాడు. వహీద్ శనివారం స్నేహితుడు యూసూఫ్‌ను కలిసేందుకు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఇక్కడ కాటసాని రాంభూపాల్‌రెడ్డి కంట  పడటంతో అప్పు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నావంటూ వహీద్‌ను తన వాహనంలో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లి బంధించాడు. ఈ విషయం తల్లి అజీజా జలీల్‌కు తెలియడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

మూడవ పట్టణ సీఐ మధుసూదన్‌రావు రాత్రి ఇంటికి వెళ్లి వహీద్‌ను విడిపించాడు. తన కుమారున్ని హత్య చేసేందుకు కాటసాని వర్గీయులు కుట్రపన్నుతున్నారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంభూపాల్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై మూడవ పట్టణపోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. ఐపీసీ 365, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ  తెలిపారు.

మరిన్ని వార్తలు