మందలిస్తే ప్రాణాలు తీశాడు..!

31 May, 2017 23:33 IST|Sakshi
మందలిస్తే ప్రాణాలు తీశాడు..!
కల్లూరు: అభంశుభం తెలియని బాలికకు మాయమాటలు చెప్పి వెంట తిప్పుకోవద్దని మందలించినందుకు  ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన పెద్దటేకూరు ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైంది. అదే కాలనీకి చెందిన రేపల్లె సుంకన్న కుమారుడు సాములు.. విద్యార్థినితో చనువుగా ఉంటున్నాడు. ఈ విషయం విద్యార్థిని జేజినాయన చిన్న సవారికి తెలిసింది. మంగళవారం రాత్రి బహిర్భూమికి వెళ్లిన అమ్మాయి ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో పాఠశాల వైపు చిన్న సవారి వెళ్లాడు. పాఠశాల గది వద్ద తన మనుమరాలితో సాములు ఉండటాన్ని జీర్ణించుకోలేక గట్టిగా మందలించాడు. వెంటనే సాములు అడ్డుగా ఉన్న చిన్న సవారిని గట్టిగా తోసేశాడు. దీంతో చిన్న సవారి కింద పడడం.. తల వెనుకభాగంలో బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలం నుంచి సాములు పరారయ్యాడు. ఉలిందకొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా బుధవారం ఉదయం మృతదేమాన్ని.. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు రూరల్‌ తాలూకా సీఐ నాగరాజుయాదవ్, ఉలిందకొండ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాములుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు