‘కియా’ పనులు వేగవంతం చేయండి : కలెక్టర్‌

22 Jun, 2017 19:49 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : కియా పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశించారు. గురువారం ఆయన కియా పరిశ్రమ ఏర్పాట్ల పురోగతిపై కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో అధికారులు, కియా మోటర్ల సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. పరిశ్రమకు అవసరమైన 599 ఎకరాల భూమిని ఆ పరిశ్రమకు బదలాయించాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. శిక్షణా కేంద్రం, టౌన్‌షిప్‌కు తాత్కాలిక ప్రాతిపదికన విద్యుత్, నీటి సరఫరా, రోడ్ల విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అదే విధంగా శాశ్వత ప్రాతిపదికన విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేసేందుకు నివేదిక అందజేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈని ఆదేశించారు. సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు.

కియా ప్రతినిధులు, ఇంజనీర్లకు తాత్కాలిక కార్యాలయం, విడిది ఏర్పాటు చేసేందుకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఉన్న భవనాలను కేటాయిస్తున్నామని, సమావేశ మందిరానికి కూడా అనుమతి ఇస్తున్నామన్నారు. గుడిపల్లి వద్ద ఆర్‌ఓబీ నిర్మించేందుకు స్థల సేకరణ, అంచనా వివరాలతో నివేదిక రూపొందించి అందజేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు సింగిల్‌ విండో పద్ధతిపై మంజూరు చేయాలన్నారు. సమావేశంలో జేసీ టి.కె.రమామణి, పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్‌బాబు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ రఘునాథ్, పెనుకొండ ఆర్డీఓ రామ్మూర్తి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి, కియా మోటర్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హువాన్‌ జిన్, డైరెక్టర్‌ కిమ్, ప్రతినిధులు జూడ్, పార్క్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు