'మాట తప్పడం మీకు వెన్నతో పెట్టిన విద్య'

17 Nov, 2015 04:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వడం, ఇచ్చిన మాటతప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా సోమవారం కిషన్‌రెడ్డి 32 ప్రశ్నలతో కూడిన బహిరంగలేఖను రాశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు, చెప్పిన మాటలకు ఆచరణలో భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు.

లక్ష రూపాయల పంటరుణాలను మాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని, ప్రశ్నించిన ప్రతిపక్షాలను అసెంబ్లీ నుంచి గెంటేశారని, అడుగుతున్న రైతులపై కేసులు పెట్టి జైళ్లలో ఉంచుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీల అమలుపై వరంగల్‌లో జరిగే ప్రచార సభలో సమాధానం చెప్పాలన్నారు. పంటరుణాల మాఫీ, దళిత ముఖ్యమంత్రి, ఇంటికో ఉద్యోగం, కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ, కేజీ టు పీజీ విద్య, ప్రతీ మండలానికో 30 పడకల ఆసుపత్రి, స్కాలర్‌షిప్‌లు, దళిత కుటుంబానికి మూడెకరాల భూమి వంటి హామీలపై కిషన్ రెడ్డి ప్రశ్నలు సంధించారు.

వరంగల్ చుట్టూ ఔటర్ రింగురోడ్డు, గుడిసెల స్థానంలో ఇళ్లు, వరంగల్‌లో విమానాశ్రయం, ఐటీ కంపెనీల తరలింపు, కాటన్ ఇండస్ట్రీ, మహిళా విశ్వవిద్యాలయం, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం వంటి హామీలు అమలు చేయకుండా ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు