పందేనికి సై

12 Jan, 2017 23:53 IST|Sakshi
పందేనికి సై
  • సంక్రాంతి కోడిపందేలకు సిద్ధమవుతున్న బరులు 
  • బరితెగిస్తున్న తమ్ముళ్లు
  • ఎమ్మెల్యే స్వగ్రామంలో మినీ స్టేడియాన్ని తలపించేలా ఏర్పాట్లు 
  • డ్రో¯ŒS కెమెరాలతో చిత్రీకరణ
  • డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గాల్లోనూ భారీ ఏర్పాట్లు
  • ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్న పోలీసులు
  • ‘‘కోడిపందేలు జరగనివ్వం. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. కోర్టులు కూడా అవే చెప్పాయి. అంతకీ పెద్ద పండగకు సంబరాలు కావాలంటే కాకినాడ రండి’’ – జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెబుతున్న మాటలివి. కానీ, వాస్తవంగా జరుగుతున్నది వేరేలా ఉంది. ఆయన సొంత నియోజకవర్గమైన అమలాపురం, ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం ప్రాంతాలతోపాటు.. కోనసీమలోని పలు ప్రాంతాల్లో పందెగాళ్లు బరితెగిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల కనుసన్నల్లో కోట్లలో పందేలు నిర్వహించేందుకు బరులు రెడీ చేశారు.
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    కోర్టు ఉత్తర్వుల ప్రకారం కోడిపందేలు నిర్వహించుకోవచ్చు. కానీ కోళ్లకు కత్తులు కడితే మాత్రం స్వాధీనం చేసుకోవాలి. సరిగ్గా దీనినే పందేల నిర్వాహకులు అవకాశంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. కోడిపందేలకు ఇక్కడ బరులు సరిపోవనే ఉద్దేశంతో పందెగాళ్లు గతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లేవారు. కానీ, ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాను తలదన్నేలా.. కోనసీమలోని మురమళ్ల, గోడి గ్రామాల్లో కోట్లలో పందేలు జరిగే పరిస్థితి కనిపిస్తోంది.
    మురమళ్లలో భారీ ఏర్పాట్లు
    ఐ.పోలవరం మండల ముఖద్వారం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం వెనుక శరభయ్య చెరువు సమీపంలో సుమారు 15 ఎకరాల్లో కోట్లలో   కోడిపందేల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్కింగ్‌కే పదెకరాలు కేటాయించారంటే ఏ స్థాయిలో పందేలు జరుగుతాయో ఊహించవచ్చు. ఆక్వా రంగంలో చేయి తిరిగిన ఒక ప్రముఖుడు అక్కడి ముఖ్యనేత సూచనతో ఈ స్థలాన్ని ఉచితంగా అందించారు. ఏర్పాట్లు మినీ స్టేడియంను తలపిస్తున్నాయి. భారీ షామియానాలు, పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. తోపులాటలు జరగకుండా భారీ గేట్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. క్రికెట్‌ స్టేడియంలో మాదిరిగా 500 మంది వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీ. 3 వేల మంది కూర్చుని వీక్షించేలా సాధారణ గ్యాలరీ ఏర్పాౖటెంది. నిర్వహణ ఏర్పాట్లకే సుమారు రూ.15 లక్షలు వెచ్చించారు. ఆ సొమ్మును గుండాట వేలం పాట సొంతం చేసుకున్నవారు అడ్వాన్సుగా ఇచ్చారని సమాచారం. నియోజకవర్గ ముఖ్యనేతకు వరుసకు సోదరుడైన మురమళ్లకు చెందిన తెలుగు యువత నాయకుడు అన్నీ తానే అన్నట్టుగా బేరసారాలు నిర్వహిస్తున్నారు. మురమళ్ల బరి నిర్వాహకులు వాట్సాప్‌లో ఆహ్వానాలు కూడా పంపించారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు స్వగ్రామం మురమళ్ల. ఆయన అనుచరగణం కనుసన్నల్లోనే ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. గత సంక్రాంతికి ఎల్‌ఈడీ తెరలతో కోడిపందేలను చూపించారు. ఈసారి డ్రో¯ŒS కెమేరాల సాయంతో పందేలను చిత్రీకరించే ఏర్పాట్లు చేస్తున్నారు. కోడిపందేలకు ముహూర్తం శుక్రవారం ఉదయం 8 గంటలుగా నిర్ణయించారు. రూ.10 లక్షల పందేలు ఎనిమిది, రూ.8 లక్షల పందేలు ఐదు, కత్తులు లేని పందేలు (జట్టీ పందేలు) మరో ఐదింటి కోసం నిర్వాహకులు సన్నాహాలు చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిర్వహించేందుకు విద్యుద్దీపాలు కూడా ఏర్పాటు చేశారు. పండగ మూడు రోజులూ ఇక్కడ రూ.10 కోట్లు పైబడే పందేలు జరుగుతాయి. మూడు రోజులూ జరిగే గుండాటను రూ.38 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు.  ఐ.పోలవరంలో ఒక టీడీపీ నాయకుడి అతిథి గృహంలో ఈ వేలం నిర్వహించారు. పేకాటకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. అత్యధికంగా స్కోర్‌ కొట్టే పేకాటగాడికి బంపర్‌ ఆఫర్‌గా రూ.15 లక్షల విలువైన కారును బహుమతిగా ప్రకటించారు. పేకాటకు ససేమిరా అంటున్న పోలీసు అధికారులపై టీడీపీ నేతలు ‘అన్ని రకాల’ ఒత్తిళ్లూ తెస్తున్నారు. అధికార పార్టీ నేతలే కోడిపందేలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ గొడవ ఎందుకని పోలీసులు స్థానికంగా ఉండకుండా కాకినాడ సాగర సంబరాలకు డ్యూటీలు వేయించేసుకున్నారని తెలిసింది.
    ఇటు అమలాపురం.. అటు పెద్దాపురం..
    ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురం. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది పెద్దాపురం నియోజకవర్గం. ఈ రెండు ప్రాంతాల్లో కూడా కోడిపందేలకు పందేలరాయుళ్లు ‘బరి’ తెగిస్తున్నారు. అమలాపురం నియోజకవర్గంలోని అల్లవరం మండలం గోడి, గుండెపూడి, అమలాపురం రూరల్‌ మండలం కామనగరువు, ఉప్పలగుప్తం మండలం కూనవరంతోపాటు.. మిగిలిన కోనసీమలోని మలికిపురం మండలం ఉయ్యూరువారి మెరక, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలంక, అంతర్వేది, రావులపాలెం మండలం దేవరపల్లి, అంబాజీపేట మండలం వాకలగరువు ఇలా ఒక్క కోనసీమలోనే సుమారు 20 ప్రాంతాల్లో పందేలు నిర్వహించనున్నారు. అల్లవరం మండలం గోడిలో భారీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇక పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట మండలం వేట్లపాలెం, వీకే రాయపురం గ్రామాల్లో రూ.70 లక్షలకు వేలం హక్కులు సొంతం చేసుకున్నారు. ఎవరెన్ని చెప్పినా పందేలు నిర్వహించి తీరుతామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
    నగదు సమస్యకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
    పెద్ద నోట్ల రద్దు సమస్యను అధిగమించేందుకు పందెగాళ్లు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.  కొందరు కొత్త రూ.2000, రూ.500 నోట్లు అవకాశం ఉన్నంత మేర సిద్ధం చేసుకున్నారు. మరికొందరు తమ బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న నగదుకు అనుసంధానంగా చెక్కు బుక్కులు,  స్వైపింగ్‌ మెషీన్లు సిద్ధం చేసుకుంటున్నారు.
     
    ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం
    అన్నిచోట్లా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. ఉన్నతాధికారులు కూడా ఈ విషయంపై మాకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బోర్డులు కూడా ఏర్పాటు చేశాం.
    – ఎల్‌.అంకయ్య, డీఎస్‌పీ, అమలాపురం
     
     
     
     
మరిన్ని వార్తలు