నిండుకుండలా కోయిల్‌సాగర్‌

26 Sep, 2016 03:48 IST|Sakshi
దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతూ నిండడానికి చేరువవుతూ వస్తున్నది. ఆదివారం ఏకంగా 25 అడుగులకు చేరుకోవడంతో పాత అలుగు రెండు అడుగుల దూరంలోనే ఉంది. రెండు అడుగుల నీరు చేరితే 27 అడుగుల పూర్తిస్థాయికి చేరుతుంది. షెట్టర్ల నుంచి జాలువారుతుంది. పాత అలుగు స్థాయి 27 అడుగులు కాగ, షెట్టర్ల స్థాయి 33 అడుగులుగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల కిందట కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ద్వార మొదటి సారి నిండింది. తరువాత గత ఏడాది కేవలం 21 అడుగుల వరకే నీటిమట్టం వచ్చింది. ఈ ఏడాది అటు ఎత్తిపోతల పథకం నీటితో పాటు పెద్దవాగు ద్వారా వస్తున్న వరదజలాలు ప్రాజెక్టులోకి ఆశించిన స్థాయిలో చేరడంతో నీటి మట్టం పెరుగుతూ వస్తున్నది.

ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ కింద పంటలు వేసుకున్న రైతులకు గత నెల రోజులుగా ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి విడుదల చేశారు. మరో నెల తరువాత ఖరీఫ్‌ పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. నీటి విడుదలను నిలిపి వేసిన తరువాత ప్రాజెక్టు నీటి మట్టం పెరుగడం ప్రారంభించింది. శనివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా నీటి మట్టం 23 అడుగులుగా ఉంది.ఒక్క రోజులోనే 2 అడుగులు పెరిగి 25 అడుగులకు చేరింది. సోమ లేదా మంగళవారం నాటికి పాత అలుగు స్థాయి 27 అడుగులకు చేరే అవకాశం ఉంది. రబీ సీజన్‌ పంటలకు నీటి కొరత సమస్య ఏర్పడబోదని రైతులు అంటున్నారు.
మరిన్ని వార్తలు