దిక్కుతోచని ‘దిగ్గజాలు’

19 Jun, 2016 17:14 IST|Sakshi
దిక్కుతోచని ‘దిగ్గజాలు’

నియోజకవర్గంలో సీఎల్పీ నేతకు వలసల భయం
పార్టీలో పీసీసీ అధ్యక్షుడికి కష్టకాలం
జిల్లా నుంచి ఉన్నత పదవుల్లో ఉన్న ఇద్దరి భవిష్యత్ ఏమిటో..
ఉత్తమ్‌ను పీసీసీ పదవి నుంచి తప్పిస్తారా..
జానా నిజంగానే సీఎల్పీ పదవి నుంచి తప్పుకుంటారా..
పదవీ గండం ఇద్దరికా.. ఒకరికా
‘కోమటిరెడ్డి’కి రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా..?
►  తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ

 
 
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తాజా రాజకీయ పరిణామాలు జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడడం లేదు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వంటి బిగ్‌షాట్స్‌తోపాటు పార్టీని వదిలివెళుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో అసలు ఏం జరుగుతుందోననే ఆందోళన  ‘హస్తం’ శ్రేణుల్లో నెలకొంది. కాంగ్రెస్‌లో జిల్లా నుంచి పెద్ద పెద్ద నాయకులున్నప్పటికీ.. పెద్ద ఎత్తున వలసలుకొనసాగుతుండడంతో  ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వారిలో నెలకొంది. ఈ క్రమంలో  పార్టీలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను తప్పిస్తారని కొందరు.. సీఎల్పీ నేత జానాను మారుస్తారని మరికొందరు అంటున్నారు. సీఎల్పీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని జానా ప్రకటించడం, ఉత్తమ్‌ను హైకమాండ్ పిలిపించడం వంటి పరిణామాల నేపథ్యంలో వారిద్దరి భవిష్యత్‌పై ఊహాగానాలు జోరందుకుంటున్నాయి.


ఆ రోజు నుంచి.. అన్నీ అడ్డంకులే
గతంలో మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ సీనియర్ శాసన సభ్యుడు కావడంతోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా కోటరీకి సన్నిహితుడు కావడంతో ఆయనకు సులువుగానే పీసీసీ అధ్యక్ష పదవి లభించింది. అయితే... ఆయన నియామకం రోజే జిల్లాకే చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటిరె డ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ ఎదిగే అవకాశం లేదని కుండబద్ధలు కొట్టారు. కోమటిరెడ్డి మాట ఏమో గానీ.. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న దాఖలాలు లేవు. ఇప్పటివరకు పార్టీ నిర్మాణంలో సాధించిందేమీ లేదని కాంగ్రెస్ శ్రేణులే బహిరంగంగా విమర్శిస్తున్నాయి. అంతేకాకుండా.. ఉన్న నాయకులంతా అధికార పార్టీ బాట పట్టగా... ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా ‘హస్తం’ విజయం సాధించలేకపోయింది.

జిల్లాలో అయితే కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లాలో ఇప్పుడు చెప్పుకోదగిన నేతలు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు. ఉత్తమ్, ఆయన సతీమణి, కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి మాత్రమే శాసనసభ, మండలిలో సభ్యులుగా ఉన్నారు. జిల్లాలోని దాదాపు ప్రముఖ నాయకులంతా పార్టీ వీడి వెళ్లిపోయారు. ఇటీవలే నియమించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీలో కూడా జిల్లాకు తగిన ప్రాధాన్యం లభించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోను చెప్పుకోదగిన విజయం నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రమే. అది కూడా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వయంకృషితో గెలుపు సాధ్యమైందనే అభిప్రాయం వచ్చింది తప్ప ఈ విషయంలో ఉత్తమ్‌కు దక్కిన క్రెడిట్ కూడా ఏమీ లేదు. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరిగాయి.

ఉత్తమ్ అనుచరులుగా ఉన్న పలువురు ముఖ్యులు అధికార టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లాలోనూ, తన సొంత నియోజకవర్గంలోనూ పార్టీని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉత్తమ్ నెట్టుకొస్తుండడం గమనార్హం. పార్టీలో జరుగుతున్న వలసలను అడ్డుకోలేకపోయారన్న విమర్శలు, ఎన్నికల్లో విజయం సాధించే ప్ర ణాళికలు రచించలేదన్న ఎత్తిపొడుపులు మినహా ఉత్తమ్‌కు దక్కిం దేమీ లేదు. ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ రాజకీయ భవిష్యత్‌పై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చలు జరుగుతుండగా, ఆయన కూడా ఏం చేయా లో పాలుపోని స్థితిలో పడ్డారని రాజకీయ వర్గాలంటున్నాయి.


 జానా వైరాగ్యం మాటున...
 తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, సీఎల్పీతో సహా ఏ పదవికైనా రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని  జానారెడ్డి ప్రకటించడంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ వైరాగ్యం వెనుక ఆంతర్యం ఏమిటనేది కాంగ్రెస్ శ్రేణులు ఆరా తీస్తున్నాయి. వాస్తవానికి తాజా రాజకీయ పరిణామాలతో జానా మనస్తాపానికి గురయినట్లు తెలుస్తోంది. పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రతి పక్ష నేత హోదాలో అవసరమైనప్పుడు ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నప్పటికీ తన సొంత నియోజకవర్గమైన నాగార్జునసాగర్ నుంచి నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తన నీడన ఎదిగిన వారే ఇప్పుడు తనను కాదని వెళ్లిపోయే పరిస్థితులు కల్పిస్తోన్న అధికార టీఆర్‌ఎస్ నేతల వైఖ రిపై ఆయన చాలా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈసారి హుం దాగా ఎన్నికల నుంచి తప్పుకుని తన కుమారుడు రఘువీర్‌ను రాజకీయ వారసుడిగా తెరపైకి తీసుకురావాలనుకున్న జానాకు తాజా పరిణామాలు మింగుడు పడనివే. తనకు వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించడంతోపాటు తన కుమారుడి రాజకీయ భవిష్యత్‌కు అడ్డంకిగా ఈ పరిణామాలు మారుతాయనే ఆలోచనలో ఆయన ఉన్నారు. ఎప్పుడూ నిండుకుండలా తొణకకుండా, బల మైన అనుచర గణాన్ని కలిగి ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన జానా ఇప్పుడు ఏకాకి అవుతున్నారా అనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో జరుగుతుండడాన్ని ఆయన ఊహించలేదు. ఎవరెటు వెళ్లినా తాను సేఫ్‌గా ఉండేలా నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ స్థాయిలో తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో తన సొంత నియోజకవర్గంతోపాటు జిల్లా రాజకీయాలు, రాష్ట్ర పార్టీలోనూ, హైకమాండ్ వద్ద తాను పలుచన అవుతున్నాననే భావనలో ఆయన ఉన్నారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. అయితే.. రాజకీయాల పట్ల ఏహ్యభావాన్ని ప్రకటించడం జానాకు కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు ఈసారి ఎన్నికల్లో తాను పోటీచేయననిప్రకటించారు. కానీ.. చివరి నిమిషంలో ఆయన పోటీ చేయ క తప్పడం లేదు. ఈసారి సీఎల్పీ పదవిని త్యజిస్తానన్న ఆయన ప్రకటన ఏ మేరకు ఆచరణలోకి వస్తుందో వేచి చూడాల్సిందే.


 మార్పులు తప్పవా?
 తాజా పరిస్థితుల్లో జిల్లా నుంచి కాంగ్రెస్ కీలక హోదాల్లో ఉన్న ఇద్దరిలో ఒకరికి లేదంటే ఇద్దరికీ పదవి గండం ఉందనే చర్చ  పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. ముందుగా సీఎల్పీ నేత జానారెడ్డిని మారుస్తారని.. ఆ తర్వాత ఉత్తమ్‌ను  తప్పిస్తారని రాజకీయ వర్గాలంటున్నాయి. జానాను కానీ, ఉత్తమ్‌ను కానీ ఇప్పటికిప్పుడే మార్చకపోవచ్చనే చర్చ ఉంది. ఒక వేళ జానాను మారిస్తే ఆ పదవిలో మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యే డీకే.అరుణకు అవకాశమిస్తారని అం టున్నారు. ఉత్తమ్‌ను మారిస్తే మాత్రం జిల్లాకే చెందిన  సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆ పదవి అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీల కంగా ఉండడంతోపాటు మంత్రి పదవిని త్యజిం చారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అనుచరగణం ఉందని..

ఈ మేరకు పీసీసీ చీఫ్ పదవి వస్తుందని అంటున్నారు. అదేవిధంగా కరీంనగర్ కు చెందిన జీవన్‌రెడ్డికి  కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టే అవకాశమున్నట్లు పీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరినీ కలుపుకుని పోయే నాయకుడిగా గుర్తింపు ఉన్న జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కోమటి రెడ్డి రాజగోపాల్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవికి  రాజగోపాల్‌రెడ్డి పేరు గతంలోనే చర్చకు వచ్చినా.. అమల్లోకి రాలేదు. ఈసారి పీసీసీ అధ్య క్ష పదవి రాజగోపాల్‌కు ఇస్తారని, ఆయన కూడా ఆ పదవి ఇస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.

>
మరిన్ని వార్తలు