దక్షిణ కాశీ.. కోనమల్లేశ్వర క్షేత్రం

10 Jun, 2017 23:20 IST|Sakshi
దక్షిణ కాశీ.. కోనమల్లేశ్వర క్షేత్రం

అనంపురము – వైఎస్సార్‌ జిల్లాల సరిహద్దులో వెలసిన కోనమల్లేశ్వర క్షేత్రం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. కొలిచిన భక్తులకు కొంగు బంగారం ఇచ్చే ఇలవేల్పుగా ఇక్కడ పరమ శివుడు విరాజిల్లుతున్నాడు. వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం పార్నపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. పూర్వం భృగు మహర్షి ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ, ఇక్కడ తపస్సు చేస్తుండేవాడని, కాలక్రమంలో జయమేజయుడు అనే చక్రవర్తి ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. సీతారామలక్ష్మణులు వనవాస కాలంలో ఆలయ పరిసరాల్లో సంచరించినందున భక్తులు ఆలయ పరిసరాల్లోకి చేరగానే సీతాదేవి వర్ణం పసుపు రంగుగా మారడం విశేషం.

ఇక్కడ ఐదు శివ లింగాలు ఉండటం, నంది విగ్రహం నోట్లో నుంచి కోనేటిలోకి నీరు రావడం ప్రత్యేకత. ఆలయంలో ప్రతి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేస్తారు. భక్తులు ముందుగా కోనేటిలో స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకుంటారు. కార్తీక మాసంలో మహిళలు ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగిస్తారు. కార్తీక మాసం నాల్గవ సోమవారం ఆలయంలో గొప్ప జాతర నిర్వహిస్తారు. ఇక్కడ వివాహ, శుభకార్యాలు నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వంట గదులు, భోజనశాల నిర్మించారు. ఈ జాతరకు అటు వైఎస్సార్‌ జిల్లా, ఇటు అనంతపురము జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
- తాడిమర్రి (ధర్మవరం)

మరిన్ని వార్తలు