కొండా లక్ష్మణ్‌ ఆదర్శప్రాయుడు

28 Sep, 2016 00:56 IST|Sakshi
కొండా లక్ష్మణ్‌ ఆదర్శప్రాయుడు
  •  వచ్చే విద్యా సంవత్సరంలో  నియోజకవర్గానికొక బీసీ గురుకులం
  •  డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
  •  
    విద్యారణ్యపురి : తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశయాలను సాధించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, స్వశక్తితో ఎదిగిన మహోన్నత వ్యక్తి బాపూజీ అని ఆయన కొనియాడారు. మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హన్మకొండలోని లష్కర్‌బజార్‌లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌లో కొండా లక్ష్మణ్‌బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోయడలో బాపూజీ పోషించిన పాత్ర కీలకమైందన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీతో పాటు కొమురం భీమ్‌, దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు, ప్రొఫెసర్‌ జయశంకర్‌, కాళోజీ వంటి గొప్ప వ్యక్తులను అధికారికంగా గౌరవిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్మారక భవన నిర్మాణం, శిలా విగ్రహం ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌కు విన్నవించనున్నట్లు తెలిపారు. తెలంగాణ హార్టీకల్చర్‌ విశ్వవిద్యాలయానికి బాపూజీ పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి ఒక బీసీ గురుకులాన్ని మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది 119 బీసీ గురుకులాలను ప్రారంభించాలని సీఎం నిర్ణయించారన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ బి.వెంకటేశ్వర్లు, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌,  కలెక్టర్‌ వాకాటి కరుణ, వరంగల్‌ నగర మేయర్‌ నన్నపునేని నరేందర్‌, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, బానోతు శంకర్‌నాయక్‌,  మాజీ జెడ్పీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, బీసీ సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నర్సింహస్వామి, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ జె.రంగారెడ్డి, బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్‌, జనరల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్‌ ,తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌, తదితరులు పాల్గొన్నారు.
     
     
     
     
మరిన్ని వార్తలు