7న కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైలే ్వ లైనుకు శంకుస్థాపన

30 Jul, 2016 21:13 IST|Sakshi
  • ఏడాది చివరి నాటికి భూసేకరణ పూర్తి
  • కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌
  •  కరీంనగర్‌ సిటీ : కరీంనగర్‌–హైదరాబాద్‌లను కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వే లైనుకు ఆగస్టు 7న గజ్వేల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంఖుస్థాపన చేస్తారని ఎంపీ బి.వినోద్‌కుమార్‌ తెలిపారు. శనివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల మీదుగా 151.36 కిలోమీటర్లతో ఈ లైను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మెదక్‌ జిల్లాలో 1260 ఎకరాలు, వరంగల్‌ జిల్లాలో 60 ఎకరాలు, కరీంనగర్‌ జిల్లాలో 900 ఎకరాల భూమి అవసరమన్నారు. మెదక్‌ జిల్లాలో 900 ఎకరాలు సేకరించామని, వరంగల్‌ జిల్లాలోని 60 ఎకరాలు సేకరించి పెగ్‌మార్కింగ్‌ చేపట్టామన్నారు. జిల్లాలో ఈ ఏడాది చివరివరకు భూసేకరణ పూర్తవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ ఎంపీగా ఉన్నపుడు జిల్లా కేంద్రం, రాజధానిలను కలిపేందుకు ఈ లైనును ప్రతిపాదించారన్నారు. మూడవ వంతు రాష్ట్ర వాటా కింద అప్పటి ప్రభుత్వం అంగీకరించి, ఉచితంగా భూమిని ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. మొదటి ఐదు సంవత్సరాల్లో రైల్వే శాఖకు నష్టం వస్తే భరించాలనే ప్రతిపాదనకూ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. పెద్దపల్లి–కరీంనగర్‌–నిజామాబాద్‌ రైల్వే లైను 26 సంవత్సరాలైనా పూర్తి కాలేదని, ఈ కొత్తపల్లి–మనోహరాబాద్‌ లైన్‌ మాత్రం వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. సిరిసిల్లలో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుతో శంకుస్థాపన చేయిస్తామన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, బాసర తదితర పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైల్వే కారిడార్‌ నిర్మించనున్నట్లు చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త జిల్లాలు రెండే ఉంటాయన్నారు. స్మార్ట్‌సిటీగా ఎంపికైన కరీంనగర్‌ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు పీపుల్స్‌ కాంటాక్ట్‌ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. జిల్లాలో విమానాశ్రయానికి బదులు ఎయిర్స్‌ ట్రిప్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎలగందుల, ఎల్‌ఎండీ ప్రాంతాలను ఇందుకు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే బొడిగె శోభ, నగర మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు