తిరుపతిలో క్రెడయ్‌ ప్రాపర్టీ షో

10 Sep, 2016 00:19 IST|Sakshi
తిరుపతిలో ఏర్పాటు చేసిన క్రెడాయ్‌ ప్రాపర్టీ షో
 
– 76 నిర్మాణ సంస్థల హాజరు 
– మూడు రోజుల పాటు ప్రత్యేక ఎగ్జిబిషన్‌
– నిర్మాణ రంగంలో సరికొత్త మార్పులు 
– తిరుపతి పరిసరాల్లో 49 కొత్త వెంచర్లు 
సాక్షి ప్రతినిధి, తిరుపతి : 
తిరుపతి పీఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం నుంచి క్రెడయ్‌ (కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) ప్రాపర్టీ షో ప్రారంభమైంది. తిరుపతి మహిళా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ వీ దుర్గాభవాని, టీటీడీ బోర్డు మెంబర్‌ భానుప్రకాష్‌రెడ్డి, నగరంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సుధారాణి ముఖ్య అతిథులుగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. క్రెడయ్‌ తిరుపతి చాప్టర్‌ ఆధ్వర్యంలో ఇది రెండో ఎగ్జిబిషన్‌. మూడు రోజుల పాటు ఇది కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. 
 
అవగాహన కోసమే...
రాష్ట్రంలోని 76 భవన నిర్మాణ సంస్థలు, కంపెనీలు ఎగ్జిబిషన్‌లో స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఆకాశ హార్మ్యాలాంటి నివాస భవనాల నిర్మాణంలో వస్తున్న సరికొత్త మార్పులు, డిజైన్లు, నాణ్యత వంటి అంశాలపై సరైన అవగాహన కల్పించడమే కాకుండా ఏఏ బిల్డింగ్‌ మెటీరియల్‌ ఎక్కడ, ఏఏ ధరల్లో లభ్యమవుతుందో తెలియజేసేందుకు ప్రాపర్టీ షో ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు వీ శ్రీనివాసులు,వెంకటేశ్‌బాబు తెలిపారు. నిర్మాణ రంగంలో విశేష అనుభవం ఉన్న నిర్మాణ సంస్థలు, వాటికి సంబంధించిన బిల్డర్లు హాజరైనట్లు తెలిపారు. 
 
ఆకట్టుకున్న స్టాళ్లు...
ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన వివిధ నిర్మాణ సంస్థల స్టాళ్లు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏఏ నిర్మాణ సంస్థ ఎక్కడ, ఎన్ని ఫ్లోర్లతో ఏ తరహా భవనాలను నిర్మిస్తోంది..వాటి ధరలు ఎలా ఉన్నాయి...ఎంత విస్తీర్ణం కొనుగోలుదారులకు దక్కుతుందనే వివరాలతో కూడిన బ్రోచర్లు, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను అందుబాటులో ఉంచడంతో సందర్శకులు ఆసక్తి కనబరిచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుమారు 5 వేల మంది ఎగ్జిబిషన్‌కు హాజరయ్యారని నిర్వాహకులు వివరించారు. 11న జరిగే ముగింపు కార్యక్రమానికి క్రెడయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆలా శివారెడ్డి (విజయవాడ), కార్యదర్శి ఆళ్ల శివారెడ్డి (గుంటూరు) హాజరవుతారని వెంకటేశ్‌బాబు తెలిపారు. ఎస్‌బీఐ డీజీఎం పవన్‌కుమార్, క్రెడయ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, పలువురు నగర ప్రముఖులు, రియల్టర్లు, బిల్డర్లు హాజరయ్యారు. 
 
 
>
మరిన్ని వార్తలు