కృష్ణా పుష్కరాల్లో వీఐపీ ఘాట్లు లేవు!

1 Jul, 2016 06:38 IST|Sakshi

విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాల్లో వీఐపీ ఘాట్లు లేవని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అందరిలానే స్నానం చేస్తారని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. గోదావరి పుష్కరాల తరహాలో ఇప్పుడు కూడా కార్పొరేటర్లకు వీఐపీ పాస్‌లు మంజూరు చేయాల్సిందిగా టీడీపీ సభ్యులు ముప్పా వెంకటేశ్వరరావు, చెన్నుపాటి గాంధీ కోరారు. దీనిపై కమిషనర్ తీవ్రంగా స్పందించారు. పుష్కరాలకు వీఐపీ ఘాట్లు ఏర్పాటు చేయడం లేదన్నారు. చివరి నిమిషంలో వీఐపీ ఘాట్లు ఏర్పాటు చేస్తే కార్పొరేటర్లకు పాస్‌లు మంజూరు చేయాల్సిందిగా మేయర్ కోనేరు శ్రీధర్ కోరారు.
 
రోజుకు 50 లక్షల మంది స్నానం..
ప్రకాశం బ్యారేజ్ నుంచి వీటీపీఎస్ కెనాల్ వరకు, సీతమ్మవారి పాదాల నుంచి కృష్ణలంక వరకు 4 కి.మీ మేర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఒక్కో కిలోమీటర్‌లో రోజుకు 6 లక్షల మంది చొప్పున  24 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారన్నారు. చిన్న పెద్ద ఘాట్లు మొత్తం కలిపి 92 ఉన్నాయని, రోజుకు 50 లక్షల మంది స్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

భక్తులు ముందుగా పుష్కర నగర్‌లకు చేరుకోవాలని సూచించారు. అక్కడ వారికి కావాల్సిన వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తారన్నారు. పుష్కర నగర్లలో బస్, రైల్వే టిక్కెట్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పండిట్ నెహ్రూ బస్టాండ్, సిద్ధార్థ మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో శాటిలైట్ బస్‌స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పుష్కర విధుల్లో సుమారు 25 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గోనున్నట్లు తెలిపారు.

నగరపాలక సంస్థ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్ళు, ప్రైవేటు పాఠశాలల్లో వీరికి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలో నీటి సమస్యను ఎలా అధిగమిస్తారని టీడీపీ సభ్యుడు ముప్పా వెంకటేశ్వరరావు ప్రశ్నించగా పట్టిసీమ నీళ్లను తరలిస్తున్నట్లు కమిషనర్ వివరణ ఇచ్చారు.
 
సాధారణ నిధులు వాడటం లేదు..
కృష్ణా పుష్కరాలకు సాధారణ నిధులు వినియోగించడం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. వైఎఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల నిధుల వినియోగం అంశాన్ని ప్రస్తావించగా ఆయనపై విధంగా సమాధానమిచ్చారు. రూ.145 కోట్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం పరిపాలనా అనుమతిల్ని మంజూరు చేసిందన్నారు. మరో రూ.39 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు