భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధం

23 Sep, 2016 09:10 IST|Sakshi
భారీ వర్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధం

కలెక్టర్ బాబు.ఎ
 
 విజయవాడ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబునాయుడుకు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం చంద్రబాబు గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.

వివిధ ప్రాంతాల్లో 6 నుంచి 14 సెంటీ మీటర్ల వరకు  వర్షపాతం నమోదైందని తెలిపారు. ఈ వర్షాల వల్ల జిల్లాలో వ్యవసాయరంగానికి మేలు చేకూరిం దన్నారు. మచిలీపట్నంలో నాట్లు పడని 38 వేల హెక్టార్లకు ఈ వర్షాలు ప్రయోజనం చేకూర్చాయన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు అత్యధికంగా వరద నీరు చేరుతుండటం వల్ల సుమారు 1.50 లక్షల క్యూసెక్కులు దిగువకు నీరు వదులుతున్న దృష్ట్యా లోతట్టు ప్రాం తాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.

గురువారం మధ్యహ్నం నుంచే సుమారు 20 వేల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్న దృష్ట్యా ప్రజలందరిని, క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. జిల్లాలో గురువారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని కలెక్టర్ పేర్కొన్నారు.

అత్యధికంగా విజయవాడ రూరల్ మండలంలో 2.2 మిల్లీమీటర్లు, విజయవాడ అర్బన్‌లో 2.1 మిల్లీమీటర్లు, నూజివీడు మండలంలో 1.4 మిల్లీమీటర్లు, మైలవరం మండలంలో 1.3 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని వివరించారు. మిగిలిన మండలాల్లో మధ్యహ్నం వరకు వర్షం కురవలేదని కలెక్టర్ తెలిపారు.
 
అప్రమత్తంగా ఉండాలి
మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లా వ్యాప్తంగా రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బాబు.ఎ సూచించారు. అల్పపీడనం కారణంగా జిల్లాలో కురిసిన భారీవర్షాలకు పులి చింతల ప్రాజెక్టు నుంచి 50 వేల నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరకు నీరు దిగువకు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి గురువారం ఉదయం 10 గంటలకు 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారని తెలిపారు. కృష్ణా పరివాహక లోతట్టు మండలాలు, గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని, ఇబ్బం దులు ఉన్నా, వర్షం నీరు గ్రామాల్లో ప్రవేశిం చినా సంబంధిత అధికారులకు సమాచారం తెలపాలని కోరారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కంట్రోల్‌రూమ్ ఫోన్ నంబర్ 08672-252572, టోల్‌ఫ్రీ నంబర్ 1077 ఫోన్‌కు సమాచారం తెలపాలని సూచించారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని మండలాలు, గ్రామాల ప్రత్యేకాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు