ఉప్పొంగిన జన కృష్ణమ్మ

23 Aug, 2016 23:47 IST|Sakshi
ఉప్పొంగిన జన కృష్ణమ్మ
పుష్కర మహోత్సవ వేళ పాలమూరు కృష్ణాతీరం జనసంద్రాన్ని తలపించింది. సెలవు రోజుల్లో జనం రద్దీ అనూహ్యంగా పెరిగింది. విశిష్ట స్థల పురాణం ఉన్న ఘాట్లకు భక్తులు పోటెత్తారు. 12రోజుల పాటు జోగుళాంబ(గొందిమల్ల), సోమశిల, బీచుపల్లి, రంగాపూర్‌ ప్రధాన ఘాట్లు భక్తులతో రద్దీగా మారాయి. వీటితో పాటు నదీ అగ్రహారం, పసుపుల, కృష్ణ, పాతాళగంగ ఘాట్లు కూడా కిటకిటలాడాయి. 
 
జోగుళాంబలో 20 లక్షలు 
జోగుళాంబఘాట్‌ నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాలు ప్రారంభోత్సవానికి అలంపూర్‌ సమీపంలోని గొందిమల్ల జోగుళాంబ ఘాట్‌ వేదికైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేడుకలను ప్రారంభించారు. గవర్నర్, మండలి చైర్మన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రస్థాయి అధికారులు, నాయకులు, సినీ స్టార్లు ఇక్కడే పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరాల 12రోజులపాటు దాదాపు 20 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తులకు ఇబ్బందులు కలకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, అగ్నిమాపక, విద్యుత్‌ శాలు విధులు సమర్థవంతంగా నిర్వహించి, సదుపాయాలు కల్పించారు. 12 రోజులపాటు ప్రశాంత వాతావరణంలో పుష్కరాలు నిర్వహించడంలో అధికారులు సఫలమయ్యారు. 
 
సోమశిలలో 27.81లక్షలు
సోమశిల పుష్కరఘాట్‌ నుంచి ‘సాక్షి’ బృందం: కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని సోమశిల ఘాట్‌లో మొత్తం 27.81లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 12వ తేదీ 53వేలు, 13న 90వేలు, 14న 1,22,200, 15న 1.52లక్షలు,16న 86,600, 17న 1.60లక్షలు, 18న 1.52లక్షలు, 19న 1,39,300, 20న 4.43లక్షలు, 21న 5.91లక్షలు, 22న 4.81లక్షలు, 23న 3.11లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. తొలి 8 రోజులు భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగింది. ఆ తర్వాత నాలుగురోజులు అనూహ్యంగా పెరిగింది. ట్రాఫిక్‌ను పోలీసులు సమర్థవంతంగా నియంత్రించారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం, మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎంలు దామోదర రాజనర్సింహ్మతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పుణ్యస్నానాలు చేశారు. మంచాలకట్టలో 5.5లక్షలు, అమరగిరిలో 6 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.  
 
రంగాపూర్‌లో 45లక్షలు
రంగాపూర్‌ఘాట్‌ నుంచి ‘సాక్షి’ బృందం:  కృష్ణా పుష్కరాలను పన్నెండు రోజుల పాటు రంగాపూర్‌ఘాట్‌లో విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఈ ఘాట్‌లోనే భక్తులు పుణ్యస్నానాలు చేశారు. జిల్లాలో దాదాపు 2 కోట్ల మంది పుష్కరస్నానం చేస్తే అందులో 45లక్షల మంది  అతి విశాలమైన రంగాపూర్‌లోనే స్నానమాచరించారు. మొదటి రెండు రోజులు జనం పలుచగా ఉన్నా నెమ్మదిగా పుంజుకుని చివరి నాలుగు రోజులు లక్షల్లో పోటెత్తారు. 10వ రోజే ఏకంగా 9 లక్షల మంది ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. పోలీసులు, అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరోత్సవాలను విజయవంతం చేశారు. రంగాపూర్‌ఘాట్‌కు వీఐపీల తాడికి అంచనాలకు మించి ఉన్నట్లు ఘాట్‌ ప్రత్యేకాధికారులు ఏజేసీ బాలాజీ రంజిత్‌ ప్రసాద్, డ్వామా పీడీ కట్టా దామోదర్‌రడ్డి, ఆర్డీఓ రామచందర్‌ తెలిపారు.
 
బీచుపల్లిలో 39.50 లక్షలు  
బీచుపల్లి నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాల్లో 12రోజుల పాటు ఇటిక్యాల మండలం బీచుపల్లిలో 38.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, పునీతులయ్యారు. పుష్కరఘాట్‌ ఇన్‌చార్జ్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ నేతృత్వంలో ప్రత్యేకాధికారులు జేసీ రాంకిషన్, గంగారెడ్డి అనునిత్యం ఎప్పటికప్పుడు ఘాట్లను పర్యవేక్షిస్తూ పుష్కరాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిగ్విజయంగా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గద్వాల డీఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో 1200మంది పోలీసులు నిఘా సారించారు. ప్రధానంగా ఘాట్లన్నీ శుభ్రంగా ఉంచడంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలల్లో అపరిశుభ్రత నెలకొనకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని నిరూపించారు. ఈ నెల 12న తెల్లవారుజామున నదీహారతితో ప్రారంభమైన పుష్కరాలు మంగళవారం సాయంత్రం 7గంటలకు నదీహారతితో ముగించారు.  
మరిన్ని వార్తలు