'కృష్ణపట్నం' దేశానికే మణిపూస

26 Feb, 2016 20:33 IST|Sakshi

కృష్ణపట్నం: కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం దేశానికే మణిపూసవంటిదని ఏపీ జెన్‌కో ఎండీ విజయానంద్ అభివర్ణించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసినట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌ను తీర్చగల సత్తా కృష్ణపట్నంకే ఉందన్నారు.

కృష్ణపట్నం ప్రాజెక్టును శనివారం ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు జాతికి అంకింతం చేస్తున్న సందర్భంగా శుక్రవారం  ప్రాజెక్టు ఆవరణలో విజయానంద్ విలేకర్లతో మాట్లాడుతూ...  అతి తక్కువ బొగ్గుతో అత్యుత్తుమ సామర్థ్యం ఉండేలా అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించామని చెప్పారు. దీని వల్ల ఈ వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు విక్రయించే సత్తా ఏపీ జెన్‌కోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇక మీదట స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ళు ఉండబోవని విజయానంద్ తెలిపారు.


ప్రాజెక్టు వ్యయం ఇప్పటి వరకూ రూ. 12,290 కోట్లకు చేరిందని, దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్ రూ. 4.53కు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మరో మూడేళ్ళలో కృష్ణపట్నంలో ఇంకో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టును నిర్మిస్తామని, అందుకు సంబంధించి బీటీజీ కాంట్రాక్టు బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చామని చెప్పారు. ఇంకా బీవోపీ కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జెన్‌కో ప్రాజెక్టు పరిధిలోని చుట్టపక్కల గ్రామాల్లో పర్యావరణ సమతుల్యత కాపాడతామని స్పష్టం చేశారు. సామాజిక బాధ్యత కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.


కృష్ణపట్నం కొత్త ప్రాజెక్టు కావడం వల్ల తొలి దశలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని... అయితే క్రమంగా వీటిని అధిగమిస్తున్నామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రోజుకు 39 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు అందేలా ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే రెండు యూనిట్లు సీవోడీ ప్రక్రియను పూర్తి చేసుకున్నందున త్వరలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు.

ఏపీ జెన్‌కో ప్రాజెక్టులన్నీ దేశంలో ఎక్కడా లేని విధంగా 80 శాతం పీఎల్‌ఎఫ్ సాధిస్తున్నాయని విజయానంద్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో థర్మల్ డెరైక్టర్ సుందర్‌సింగ్, ప్రాజెక్టు మేనేజర్ రాఘవేందర్‌రావు, సీఈ సత్యనారాయణ, ఏపీ ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణపట్నం ప్రాజెక్టుపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను విలేకర్లకు ఈ సందర్భంగా విజయానంద్ వివరించారు.

మరిన్ని వార్తలు