నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..

20 Oct, 2015 04:31 IST|Sakshi
నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా..

వాటర్ గ్రిడ్‌లో అవినీతి ఆరోపణలపై కేటీఆర్
 
 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: వాటర్ గ్రిడ్‌లో అవి నీతి, అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. 1,800 పేజీలతో కూడిన వాటర్ గ్రిడ్ డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను బయటపెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సోమవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో కలిసి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. నిర్మల్ మండలం వెల్మల్ వద్ద వాటర్‌గ్రిడ్ ఇంటెక్‌వెల్ పనులు పరిశీలించారు. దిలావర్‌పూర్ మండలం మాడేగాంలో గ్రిడ్ పైలాన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్రతి ఇంటికి శుద్ధ జలాలు అందించేందుకు రూ.35 వేల కోట్లతో ఓ భగీర థ ప్రయత్నం చేస్తున్నాం. 1.25 లక్షల కి.మీ. పైప్‌లైన్లు, 50 వరకు నీటి శుద్ధి కేంద్రాలను నిర్మిస్తున్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటర్ గ్రిడ్ ద్వారా తెలంగాణ ప్రజలకు నీళ్లిస్తాం. ప్రతిపక్షాలకు కూడా మూడు చెర్ల నీళ్లు తాగిస్తాం’ అన్నారు. ‘ఇంటింటికీ శుద్ధ జలాలు అందిస్తే.. నీటి పన్నులు చెల్లించేం దుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పనులు పూర్తయ్యాక పన్ను ఎంత వసూలు చేయాలనేది నిర్ణయిస్తాం.

అఖిలేష్ యాదవ్ పిలిస్తేనే నేను యూపీకి వెళ్లా. కోడిగుడ్డుపై ఈకలు పీకితే ఎలా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ప్రజల్లో కలుస్తున్నం దుకు సంతోషం. గ్రిడ్ పనులకు డీపీఆర్‌లున్నా యా అని అడుగుతున్నారు. డీపీఆర్‌లు లేకుండానే నాబార్డు, హడ్కో వంటి సంస్థలు రుణాలిస్తాయా? ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరు తాగునీటి ప్రాజెక్టుకు రూ.7వేల కోట్లు ఇస్తూ సంతకం పెట్టిన అప్పటి ఓ మంత్రి తన సొంత జిల్లా నల్లగొండలో ఫ్లోరోసిస్ బాధితులకు సురక్షిత జలాలు ఇవ్వలేకపోయారు.

మీ మాదిరిగా కాంట్రాక్టర్ల కోసం కాకుండా ప్రజల కోసం పైప్‌లైన్లు వేస్తున్నాం. తెలంగాణకు టీఆర్‌ఎస్ కన్నతల్లి అయితే కాంగ్రెస్ మంత్రసాని. వచ్చే జూన్ నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు రూ.2వేల కోట్లతో పనులు చేపట్టాం. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం’ అన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించిందన్నారు. మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, విఠల్‌రెడ్డి, రాథోడ్‌బాపూరావు, జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు