రైతు బంధువులు కాదు.. రాబందులు వాళ్లు

18 Oct, 2015 01:58 IST|Sakshi
రైతు బంధువులు కాదు.. రాబందులు వాళ్లు

 కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్
 మూడేళ్లలో వాటర్‌గ్రిడ్ పూర్తి... ప్రజలకు నల్లాల ద్వారా నీరు తాగిస్తాం
 రైతు కష్టాలకు 42 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు కారణం కాదా?

 
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ నేతలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు నిప్పులు చెరిగారు. ఆ పార్టీ నేతలు చేపడుతున్న రైతు భరోసా యాత్రపై మండిపడ్డారు. వాళ్లు రైతు బంధువులు కాదని, బతికున్న వాళ్లను పీక్కుతినే రాబందులని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి గల్లంతవుతోందన్న భయం వల్లే.. అభివృద్ధిపథంలో వెళ్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ నేతల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు ఉదయసముద్రం ప్రాజెక్టు వద్ద వాటర్‌గ్రిడ్ పనులకు మంత్రులు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలతో కలసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
 
 అనంతరం పీజీ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే ముందుందని, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఎవరెన్ని అవరోధాలు సృష్టించినా మూడేళ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలకు న ళ్లాల ద్వారా నీళ్లు తాగించి, ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తామని వ్యాఖ్యానించారు.
 
 మీ ఊళ్లో అడుగుదామా?
 తనకు జానారెడ్డి అంటే ఎంతో గౌరవమని కేటీఆర్ చెప్పారు. ‘‘అయితే ఇటీవల నేను చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందిస్తూ.. ‘నీకేం తెలుసు నా సంగతి.. మీ అయ్యను అడిగితే చెప్తడు’ అని అన్నారు. మా అయ్యనెందుకు? ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో ఉన్న అయ్యలనడిగితే మీ చరిత్ర, కాంగ్రెస్ నేతల చరిత్ర చెప్తరు..’’ అని అన్నారు. ‘‘నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు.. లేదంటే మీ ఊర్లోనయినా అడుగుదాం. నల్లగొండ జిల్లా విషపు నీళ్లు తాగడానికి కారణమెవరో తేల్చుదాం’’ అని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఉత్తరకుమార్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. ‘‘ఈయన కార్లో కాదా ఎన్నికలప్పుడు రూ.3 కోట్లు దొరికింది.. ఎక్కడివి ఆ కట్టలు మర్చిపోయిండా? అలాంటి ఆయన టీఆర్‌ఎస్‌ను అవినీతిలో దేశముదురు అంటాడా? మేం మాట్లాడితే మీరు తట్టుకోలేరు. ఉద్యమంలో సింగిల్‌గా ప్రారంభమైనా, ఇప్పుడు ప్రతి గ్రామంలో 100 మంది కేసీఆర్లున్నరు. మాకు ఐదేళ్లు పాలించాలని ప్రజలు అధికారం ఇస్తే.. మీరు 15 నెలలకే బొబ్బలు పెడ్తరా?’’ అని విరుచుకుపడ్డారు.
 
 రైతుల వెతలకు ఆ పార్టీలే కారణం
 ‘‘ఉమ్మడి రాష్ట్రాన్ని 42 ఏళ్లు కాంగ్రెస్, 17 ఏళ్లు టీడీపీ పాలించాయి. ఇప్పుడు తెలంగాణలో రైతుల అవస్థలకు ఆ రెండు పార్టీలు కారణం కాదా’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రైతులకు రుణమాఫీ చేస్తుందన్నారు. అయితే ఒకేసారి మాఫీ చేయడానికి ప్రభుత్వం దగ్గర మూటలుండవని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలెవ్వరూ తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్లు కాదన్నారు. వాళ్లంతా తెలంగాణ వద్దన్నోళ్లు, ఒకవేళ వచ్చినా ముఖ్యమంత్రులం అవుదామని కలలు కన్నోళ్లు అని విమర్శించారు. వాటర్‌గ్రిడ్‌కు రూ.36 వేల కోట్లు ఖర్చవుతాయా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని, అయితే గతంలో సీఎం కిరణ్ ఒక్క చిత్తూరు జిల్లా మంచినీటి పథకానికే రూ.7 వేల కోట్లతో ప్రతిపాదనలు పెట్టినప్పుడు, కేబినెట్‌లో ఉండి ఎలా సంతకాలు చేశారని ప్రశ్నించారు. వాటర్‌గ్రిడ్ గురించి ఎక్కడో ఉన్న యూపీ అఖిలేశ్‌కు అర్థమయింది కానీ... జానారెడ్డికి, ఉత్తమ్‌కు మాత్రం అర్థం కావడం లేదన్నారు.
 
 భూస్వామ్య విధానాన్ని తెచ్చే కుట్ర: జగదీశ్‌రెడ్డి
 కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో పాత భూస్వామ్య విధానాన్ని తెచ్చేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు అధికార పార్టీ నాయకులను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారన్నారు. అయితే వారి ట్రాప్‌లో తాము పడబోమని చెప్పారు. గత పాలకుల చేతగాని తనం వల్లే రాష్ట్రంలో తాగునీరు కూడా లేకుండా పోయిందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సభలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నల్లగొండ జిల్లా ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 150 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.
 
 సభలో ఆశ వర్కర్ల నిరసన
 బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతున్న సమయంలో ఆశ వర్కర్లు నిరసన తెలియజేశారు. సభా ప్రాంగణంలో నల్లజెండాలు ప్రదర్శించి, ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. తమకిచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని నినాదాలు చేశారు. నేతలు సముదాయించినా వినకపోవడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి వారిపై మండిపడ్డారు. ‘మీరు సమస్య పరిష్కారానికి వచ్చినట్టు కనిపించడం లేదు. ఎవరో పంపితే ఇక్కడకు వచ్చి ఉంటారు. ఎక్కువసేపు గొడవ చేస్తే పార్టీ కార్యకర్తల్లో తిరుగుబాటు వస్తుంది. అప్పుడు మీరు తట్టుకోలేరు.’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు