కేయూ వీసీ మనోడే

26 Jul, 2016 00:36 IST|Sakshi
కేయూ వీసీ మనోడే
  • ఆర్‌.సాయన్నది కొరట్‌పల్లి
    • రెగ్యులర్‌ వైస్‌చాన్స్‌లర్‌గా నియామకం
    డిచ్‌పల్లి : కాకతీయ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్‌ విభాగం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.సాయన్న నియమితులయ్యారు. ఆయన డిచ్‌పల్లి మండలం కొరట్‌పల్లికి చెందినవారు. సోమవారం వీసీగా ఉత్తర్వులు వెలువడగా.. అదే రోజు కేయూలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేయూలో మూడేళ్లపాటు వీసీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
    జూనియర్‌ లెక్చరర్‌ నుంచి..
    కోరట్‌పల్లికి చెందిన ఆర్‌.సాయన్న 1955 ఆగస్టు 18న  జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1978లో బీఎస్సీ (ఎంపీసీ), 1980లో ఎమ్మెస్సీ(ఫిజిక్స్‌) పూర్తి చేశారు. ఓయూలోనే 1988లో ఫిజిక్స్‌ విభాగంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆయన ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ పూర్తికాగానే 1981–1983 వరకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో లెక్చరర్‌గా, 1983 నుంచి 1989 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో 1989 నుంచి 1991 వరకు ఫిజిక్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా, 1991 నుంచి 1999 వరకు అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1999 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేసి కొద్దికాలం క్రితం రిటైరయ్యారు. ఇంజినీరింగ్‌ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్‌ డివైస్‌ అండ్‌ సర్క్యూట్స్, డిజిటల్‌ లాజిక్‌డిజైన్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సబ్జెక్టులలో బోధించారు. ఏడు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. పలు పరిశోధనాlపత్రాలను సమర్పించారు. నలుగురు అభ్యర్థులు ఆయన వద్ద పీహెచ్‌డీ చేస్తున్నారు. 
    పరిపాలనానుభవం..
    1991లో సైఫాబాద్‌ పీజీ కాలేజీ హాస్టల్‌ వార్డెన్‌గా పనిచేశారు. నిజాం కాలేజీ కాన్ఫిడెన్షియల్‌ పరీక్షల విభాగం బాధ్యతలను కూడా నిర్వర్తించారు. 1996లో పీజీ అడ్మిషన్‌ కమిటీ సభ్యులుగా పనిచేశారు. స్పోర్ట్స్‌ కమిటీ సభ్యులుగా బాధ్యతలు చూశారు. అకడమిక్‌ పరంగా వివిధ కమిటీల్లోనూ సభ్యుడిగా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సులకు అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా 1996 నుంచి 2000 వరకు వ్యవహరించారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో జీవితకాల సభ్యుడి, సొసైటీ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఇన్‌ సాలిడ్‌ స్టేట్‌ సైన్స్‌ ఫౌండర్‌ సభ్యుడు పనిచేశారు. 

     

మరిన్ని వార్తలు