‘కిలిమంజారో’ను అధిరోహించిన కర్నూలు వాసి

16 Aug, 2016 23:31 IST|Sakshi
‘కిలిమంజారో’ను అధిరోహించిన కర్నూలు వాసి
కర్నూలు(హాస్పిటల్‌): రెండతస్తుల్లో ఉన్న కార్యాలయానికి వెళ్లాలంటే మెట్లు ఎక్కకుండా లిఫ్ట్‌ కోసం చూసే రోజులివి. అలాంటిది ఓ యువతి 19,341 అడుగుల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని రెండోసారి ఎక్కి ఔరా అనిపించింది. తనతో పాటు మరికొంత మంది బాలబాలికలను ఈ సాహస కార్యానికి తీసుకెళ్లి చప్పట్లు కొట్టించుకుంది. తెలంగాణా రాష్ట్రం తరపున వెళ్లినా ఆమె తల్లిదండ్రులది కర్నూలు నగరమే కావడం విశేషం. 
 నగరంలోని వెంకటరమణ కాలనికి చెందిన నాగరాజు, సుశీల కుమార్తె రాజి తమ్మినేని పర్వతారోహకులుగా కొనసాగుతున్నారు. ఆమె సోదరుడు భరత్‌ తమ్మినేని సైతం ఇదే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గత సంవత్సరం వీరిద్దరూ కలిసి ఆఫ్రికా ఖండం టాంజినియా దేశంలోని 19,341 అడుగుల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఇప్పుడు ఆమె మెదక్‌ జిల్లాలోని ట్రై బల్‌ వెల్ఫేర్‌ పాఠశాలలకు చెందిన 15 ఏళ్లలోపు బాలికలకు శిక్షణ ఇచ్చి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహింపజేశారు. ఈ నెల 15వ తేదీన ఉదయం 8 గంటలకు ఈ పర్వతంపై ఈ బందం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. అన్ని రాష్ట్రాలకు చెందిన పర్వతారోహకులకు ఆమె గైడ్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు కిలిమంజారో పర్వతాన్ని  ఎక్కడ ఒక రికార్డు అని, ప్రపంచంలో ఇతర ఆరు శిఖరాలు అధిరోహించేందుకు ఈ యాత్ర నాకు ఒక స్ఫూర్తిగా నిలిచిందని ఆమె తెలిపారు. 2017 ఏప్రిల్‌లో తన సోదరుడు భరత్‌తో కలిసి ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నట్లు  పేర్కొన్నారు. తనకు ప్రోత్సాహమిస్తున్న అభయ ఫౌండేషన్‌కు ఈ సందర్భంగా ఆమె కతజ్ఞతలు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు