కర్నూలు నంబర్‌ వన్‌

12 Dec, 2016 15:25 IST|Sakshi
కర్నూలు నంబర్‌ వన్‌
–పారిశ్రామిక, సేవారంగంలో, తలసరి ఆదాయంలో కర్నూలుకు మొదటి ర్యాంకు
–14వ స్థానానికి పరిమితమైన మంత్రాలయం
– నియోజక వర్గాల వారీగా ర్యాంకులను ప్రకటించిన  జిల్లా యంత్రాంగం
 
కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నంబర్‌ - 1 గా నిలిచింది. 2015–16 సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, రంగాల వారీగా లభించిన గ్రేడుల వివరాలను అధికారులు సోమవారం ప్రకటించారు. జిల్లా విస్తీర్ణం 17658 చదరపు కిలో మీటర్లు ఉంది. అన్నింటిలో   కర్నూలు నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండగా.. డోన్‌ అసెంబ్లీ నియోజక వర్గం రెండో స్థానంలో నిలిచింది.  వ్యవసాయ ఉత్పాదకతలో మాత్రం కోడుమూరు నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. మొదటి సారిగా నియోజకవర్గాల వారీగా స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం, రంగాల వారీగా ర్యాంకులు ఇచ్చారు. 
 
  • జిల్లా కేంద్రమైన కర్నూలులో పరిశ్రమలు ఎక్కువగా ఉండటం, సేవా రంగానికి చెందిన అన్ని కార్యక్రమాలకు కర్నూలు కేంద్ర బిందువుగా ఉండటంతో కర్నూలు అసెంబ్లీకి నంబరు–1 స్థానం లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయంలోనూ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లా వెనుకబడి ఉంది. స్థూల ఉత్పత్తిలో రాష్ట్రంలో జిల్లాకు 9వ స్థానం, తలసరి ఆదాయంలో 11వ స్థానం లభించింది. 2011–12 ధరల ప్రకారం వ్యవసాయ, పారిశ్రామిక, సేవ రంగం ప్రగతిని అంచనా వేశారు. జిల్లా మొత్తం మీద స్థూల ఉత్పత్తి విలువ రూ.29,887.30 కోట్లు ఉండగా, తలసరి ఆదాయం రూ.72,463 ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. జిల్లా స్థూల ఉత్పత్తిని వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగాల నుంచి లెక్కిస్తారు.  
  •  జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యవసాయ ఉత్పాదకత రూ.9631.62 కోట్లు ఉండగా కోడుమారు నియోజక వర్గం మొదటి స్థానంలో, పత్తికొండ నియోజకవర్గం 2వ స్థానంలో ఉంది.ఽ కర్నూలు నియోజకవర్గానికి 14వ స్థానం దక్కింది.  
  •  పారిశ్రామిక రంగంలో జిల్లా ఉత్పాదకత రూ.6066.75 కోట్లు ఉండగా, కర్నూలు నియోజకవర్గానికి 1వ ర్యాంకు, డోన్‌కు 2వ ర్యాంకు లభించింది. మంత్రాలయం నియోజకవర్గానికి 14వ ర్యాంకు లభించింది.
  • సేవా రంగంలో రూ.14,188 కోట్ల విలువ సేవలు అందగా, ఇందులో కర్నూలు నియోజకవర్గానికి మొదటి ర్యాంకు, నంద్యాలకు రెండవ ర్యాంకు లభించింది. మంత్రాలయం 14వ ర్యాంకుతో సరిపుచ్చుకుంది.
  •  జిల్లా మొత్తం మీద తలసరి అదాయం రూ.72,463 ఉండగా, కర్నూలు అసెంబ్లీలో అత్యధికంగా రూ1,18,446 ఉండి మొదటి ర్యాంకును పొందగా, డోన్‌ అసెంబ్లీ 2వ ర్యాంకును పొందింది. తలసరి ఆదాయంలోను మంత్రాలయం నియోజకవర్గం 14వ ర్యాంకుతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. నియోజకవర్గాల వారీగా ర్యాంకుల వివరాలను జిల్లా ప్రణాళిక విభాగం అధికారులు జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.   
మరిన్ని వార్తలు