సా...గుతున్న పనులు

9 Jun, 2016 00:50 IST|Sakshi

 ప్రభుత్వ శాఖల మధ్య    సమన్వయలోపం
ఇప్పటికి పూర్తయిన   పుష్కర పనులు 30 శాతమే..
కాంట్రాక్టర్లకు తాఖీదులు   ఇవ్వనున్న అధికారులు

 

చేపా.. చేపా.. ఎందుకు ఎండలేదే అంటే గడ్డిమోపు అడ్డొచ్చింది.. అన్న కథను గుర్తుకు తెచ్చేలా విజయవాడ నగరంలో కృష్ణాపుష్కరాల పనులు కొనసా...గుతున్నాయి. రూ.98 కోట్లతో చేపట్టిన రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు నత్తకే నడక నేర్పుతున్నాయి. వానలు ముంచుకు రావడంతో అసలు ఈ పనులు పూర్తవుతాయా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.

 

విజయవాడ సెంట్రల్ :  పుష్కరాల అభివృద్ధి పనులు మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కు నడుస్తున్నాయి. ఈనెలాఖరుకు పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు మూడు సర్కిళ్ల పరిధిలో 55 రోడ్లను రూ.98 కోట్లతో విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. 14 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. రెండు నెలల క్రితం ప్రారంభమైన పనులు ముందుకు కదలడం లేదు. పుష్కరాలకు ముహూర్తం ముంచుకొస్తుండటంతో అధికారుల్లో హైరానా మొదలైంది.

 
సమన్వయలోపం

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే పనులు చురుగ్గా సాగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.  ట్రాన్స్ కో అధికారులు ఆయా స్థలాల్లోని  విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పనులు సాగడం లేదు. విద్యుత్‌స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించి ఇస్తే కానీ పనులు చేయలేమని కొందరు కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. నగరపాలక సంస్థ ఇంజి నీరింగ్ అధికారులు పలుమార్లు ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణదారులు, స్థల యజమానులు కోర్టు నుంచి స్టే తెస్తుండటంతో తొలగింపు ప్రక్రియకు బ్రేక్ పడుతోంది. చెట్లు తొలగించిన తరువాత వాటి తరలింపు సకాలంలో జరక్కపోవడంతో రోజుల తరబడి పనులు నిలిచిపోతున్నాయి.

 
సబ్‌లీజులు

పుష్కర పనులను 14 ప్యాకేజీలుగా విభజించగా బడా కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. వీరిలో కొందరు సొంతంగా ప్రారంభించగా, మరికొందరు సబ్‌లీజ్‌కు చిన్న కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనులకు సంబంధించి నిధులను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు సందేహంలో పడ్డారు. హడావుడిగా పూర్తి చేశాక డబ్బులు రాకుంటే అడ్డంగా బుక్కైపోతామన్న భయం వారిని వెంటాడుతోంది. ఈక్రమంలో పనులు చేయాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పనులు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి.

 
తాఖీదులు సిద్ధం

కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు పనులు చేయడంలో వెనకబడ్డ కాంట్రాక్టర్లకు తాఖీదులు ఇచ్చేందుకు ఇంజినీరింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా నోటీసులు ఇచ్చి వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని భావిస్తున్నారు.  సర్కిల్ -3 పరిధిలో పనులు చేపట్టిన వీఎస్ ఇంజినీరింగ్స్‌తో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టర్ల  పనితీరుపై కమిషనర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

>
మరిన్ని వార్తలు