సమాచార హక్కు చట్టం అమలుకు సహకారం కరువైంది

22 Sep, 2016 23:42 IST|Sakshi
సమాచార హక్కు చట్టం అమలుకు సహకారం కరువైంది
నూజివీడు:  
సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించ డంలో ప్రభుత్వ సహకారం ఏమాత్రం లేదని రాష్ట్ర సమాచార కమిషనర్‌ లాం తాంతియాకుమారి  పేర్కొన్నారు. నూజివీడు ఆర్‌అండ్‌ బీ అతిథి గృహంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్లు ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషిచేయాల్సి ఉందన్నారు. అయితే కలెక్టర్లు ఆ పనిచేయడం లేదన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం తీసుకువచ్చిన ఈ చట్టంపై ప్రజలకు పూర్తి అవగాహన వచ్చినట్లయితే అధికారులెవరూ తప్పు చేయడానికి సాహసించరన్నారు. అవినీతి కూడా చాలా వరకు తగ్గిపోతుందన్నారు. పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే సమాజానికే నష్టం వాటిల్లుతుందన్నారు.  తన పరిధిలో ఇప్పటి వరకు 12వేల దరఖాస్తులు రాగా, వాటిలో 10వేల దరఖాస్తులు పరిష్కరించానని తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కొందరు అధికారులు కోరిన సమాచారాన్ని దరఖాస్తు దారుడికి ఇవ్వకుండానే తమ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతున్నారని చెబుతున్నారని, ఇలా చేయడం సమంజసం కాదన్నారు. దరఖాస్తుదారుడు అడిగిన సమాచారం ఇవ్వడానికి అధికారులకు వచ్చే నష్టమేమిటని ఆమె ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులే సమాచారాన్ని ఇవ్వడానికి భయపడతారన్నారు. ప్రజలు కూడా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా సమాజానికి ఉపయోగపడేలా చూడాలన్నారు. 
 
మరిన్ని వార్తలు