అతివలే ఆలయ పెద్దలు

17 Feb, 2016 08:09 IST|Sakshi
అతివలే ఆలయ పెద్దలు

ఏపీలో తొలిసారి ఒక గుడికి మహిళా సభ్యులతోనే పాలకమండలి ఏర్పాటు
ఇదో నూతన అధ్యాయం: ఏపీ అర్చక సమాఖ్య సింగుపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానం ట్రస్టుబోర్డులో అందరినీ మహిళలనే నియమించడం ద్వారా  కమిషనర్ అనురాధ కొత్త ఒరవడి సృష్టించారని ఏపీ అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో కొనియాడింది.
 
సాక్షి, హైదరాబాద్: ఏపీలో తొలిసారి ఓ గుడికి మొత్తం మహిళలతోనే పాలక మండలి ఏర్పాటైంది. ఆ గుడి అభివృద్ధికి మహిళలు పడుతున్న శ్రమను చూసి ఊరు ఊరంతా మంత్ర ముగ్ధులైంది. ఈసారి గుడి పాలకమండలిని ఆ మహిళలతోనే ఏర్పాటు చేయాలని ఆ ఊరి ప్రజలు తీర్మానించుకున్నారు. గ్రామ సర్పంచ్ ద్వారా స్థానిక ఎమ్మెల్యేకు ఆ విషయాన్ని తెలియజేశారు. ఆయన దేవాదాయ శాఖకు సిఫార్సు చేశారు. దీంతో మొత్తం ఆరుగురు మహిళా సభ్యులతో ఆ గుడికి పాలక మండలిని నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ జనవరి 22న ఉత్తర్వులు జారీ చేశారు. అతివలే ఏలే ఆ ఆలయం.. గుంటూరు జిల్లా రేపల్లె మండలం, సింగుపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం. కొత్తగా నియమితులైన పాలకమండలి బుధవారం ఉదయం 10:30 గంటలకు ఆ గుడిలోనే ప్రమాణ స్వీకారం చేయబోతోందని ఆలయ ఈవో సాంబశివరావు ‘సాక్షి’కి తెలిపారు.

బాగోగులన్నీ వాళ్లే..
ఏటా రూ. 2 లక్షలు ఆదాయం ఉండే ఆ గుడికి మరమ్మతులు కోసం నిధులు సరిపోకపోతే.. ఆ మహిళలే ఊరి ప్రజల నుంచి రూ. 8.5 లక్షల విరాళాలు సేకరించి మరమ్మతులు చేయించారు. అర్చకుడి కోసం ప్రత్యేకంగా ఒక ఇల్లు కట్టించారు. గుడికి కొత్తగా విద్యుదీకరణ చేయించారు. దేవుడి రథానికి కొత్త షెడ్ కట్టించారు. ఇలా మహిళలు పడుతున్న శ్రమ చూసి గ్రామస్తులందరి సూచనతో సర్పంచి ప్రేమాజీ ఆ మహిళలతోనే గుడి పాలకమండలి ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను కోరారు. ఆ విజ్ఞప్తిని ఆయన దేవాదాయ శాఖ కమిషనర్‌కు విన్నవించారు.

మరిన్ని వార్తలు