ఎయిర్పోర్ట్కి భూములిస్తే రాజధానిలో స్థలాలు

4 Mar, 2016 12:42 IST|Sakshi
నూజివీడు సబ్‌కలెక్టర్ జి.లక్ష్మీశ

నూజివీడు : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు అవసరమైన భూమి ఇచ్చిన వారికి రాజధాని ప్రాంతంలో ఎకరానికి వెయ్యి చదరపు గజాల నివేశన స్థలం రెసిడెన్షియల్ ఏరియాలోను, 450 గజాలు కమర్షియల్ ఏరియాలో ఇస్తామని  సబ్‌కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విమానాశ్రయ విస్తరణకు అవసరమైన 1,229 ఎకరాల భూములను ల్యాండ్ ఫూలింగ్ విధానంలో సేకరిస్తున్నామని, ఇప్పటివరకు 30 ఎకరాలు సేకరించామని అన్నారు.
 
గన్నవరం, ఉంగుటూరు మండలాలకు చెందిన 11 గ్రామాలలో భూసేకరణ జరుపుతున్నట్లు ఆయన వివరించారు. ముందు ఇచ్చిన వారికి ప్రాధాన్యతాక్రమంలో స్థలాలను కేటాయిస్తామన్నారు. గృహాలు కోల్పోయిన వారికి ఐదు సెంట్ల స్థలంలో ఇళ్లు కట్టించి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అద్దెకు ఉన్న వారికి వడ్డీలేని రుణాలను రూ.25 లక్షల వరకు ఇవ్వనున్నట్లు సబ్ కలెక్టర్ చెప్పారు.
 
ఏలూరు కాలువ మళ్లింపులో భూములు కోల్పోతున్న రైతులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారాన్ని తీసుకోవాలన్నారు. నావిగేషన్‌కు అనువుగా ఈ కాలువను అభివృద్ధి చేస్తున్నారన్నారు. 120 మీటర్ల వెడల్పున కాలువ నిర్మాణం ఉంటుందని, లోపలి భాగం 60 నుంచి 70 మీటర్లు ఉంటుందని, రెండు వైపులా కట్టలను నిర్మించి దానిపై రోడ్లు నిర్మిస్తారని చెప్పారు. ప్రగతిని అడ్డుకోవాలని చూస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు