రెండేళ్లలో రీజినల్ 'రింగ్'

19 Oct, 2016 02:23 IST|Sakshi
రెండేళ్లలో రీజినల్ 'రింగ్'

భూసేకరణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం

‘ఔటర్’ అవతల 330 కి.మీ. మేర నిర్మాణం
డీపీఆర్‌లలో జాప్యం లేకుండా చూడండి
రహదారులపై ప్రాణనష్టం కలచివేస్తోంది
రోడ్ల నిర్మాణంపై సమగ్ర అధ్యయనం అవసరం
పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రోడ్ నెట్‌వర్క్ ఎలా ఉండాలో
విజన్ డాక్యుమెంట్ రూపొందించండి
యూరప్, అమెరికాలోని రోడ్లను పరిశీలించాలని ఆదేశం
జాతీయ రహదారులపై గడ్కారీని కలవాలని నిర్ణయం

 
40 నుంచి 50 కి.మీ. దూరంలో నగరం చుట్టూ వివిధ రహదారులపై ఉన్న ఈ పట్టణాలను అనుసంధానిస్తూ రీజినల్ రింగ్‌రోడ్డును ప్రతిపాదించారు.
 
 1.    చౌటుప్పల్
 2.    భువనగిరి
 3.    ములుగు
 4.    తూప్రాన్
 5.    నర్సాపూర్
6.    సంగారెడ్డి
7.    శంకర్‌పల్లి
8.    చేవెళ్ల
9.    షాబాద్
10.    షాద్‌నగర్
11.    కందుకూరు
12.    గున్‌గల్
 
సాక్షి, హైదరాబాద్
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల 330 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డును రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియకు వెంటనే శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. డీపీఆర్‌ల తయారీలో జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చాలా పనుల్లో డీపీఆర్‌ల పేరుతో ఎడతెగని జాప్యం జరుగుతోందని, అవసరమైతే పనులను ఎక్కువ ప్యాకేజీలుగా విభజించి సత్వరమే డీపీఆర్‌లు రూపొందించాలని సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఆ శాఖ ఈఎన్‌సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి తదితరులతో సీఎం సమావేశమయ్యారు.
 
 రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని సమీక్షించారు. రోడ్డు ప్రమాదాల్లో నిత్యం ఎంతోమంది చనిపోవటం కలచివేస్తోందని, దీన్ని వెంటనే నియంత్రించాల్సిన అవసరం ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. ‘‘భవిష్యత్తులో మన రోడ్లు ప్రమాదరహితంగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? ఓ పదేళ్ల తర్వాత తెలంగాణ రోడ్ నెట్‌వర్క్ ఎలా ఉండాలి? అందుకు ప్రభుత్వపరంగా చేపట్టాల్సిందేంటి? తదితర వివరాలతో ఓ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయండి. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే నెంబర్ వన్ రోడ్‌నెట్‌వర్క్ తెలంగాణలో ఉండాలి’’ అని అధికారులకు  సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత రోడ్ల పరిస్థితిని అధ్యయనం చేసి వచ్చే పదేళ్ల తర్వాత ఎలా ఉండాలన్న అంశంపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.
 
 రోడ్లు పది కాలాలపాటు మన్నేలా ఉండాలి
 భారీ వర్షాలకు రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయని, ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని పదికాలాల పాటు మన్నేలా రహదారులు ఉండేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇది యావత్ దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, విస్తరణ, మెరుగుపరిచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని, కేంద్రం నుంచి కూడా 2,500 కి.మీ. మేర జాతీయ రహదారులను మంజూరు చేయించుకోగలిగామని చెప్పారు. వర్షం వస్తే రోడ్లు ఎక్కువగా పాడవుతున్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక విధానాలు అనుసరించాలన్నారు.

ఇందుకు ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. అమెరికా, యూరప్ దేశాల్లో రోడ్లు బాగుంటాయని, ఆయా దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకోవాలని సూచించారు. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఎక్కడెక్కడ ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు, అండర్‌పాస్‌లు అవసరం? నదులు, వాగులపై ఎక్కడ వంతెనలు, కాజ్‌వేలు అవసరమో కూడా విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరచాలన్నారు.
 
 రోడ్లపై మలుపులు తక్కువగా ఉండాలి
 ప్రమాదాల నివారణకు రోడ్లపై మలుపులు తక్కువగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. పట్టణాలు, పెద్ద గ్రామాల మీదుగా జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లు సాగకుండా బైపాస్‌లు నిర్మించాలన్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న చోట్ల  ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారుల వెంట అవసరమైన ప్రాంతాల్లో ఐలాండ్స్ నిర్మించి పక్కాగా నిర్వహించాలని సూచించారు.
 
 జాతీయ రహదారులపై గడ్కరీతో మాట్లాడదాం
 ఇటీవలే తెలంగాణకు కేంద్రం 2500 కి.మీ. మేర కొత్త జాతీయ రహదారులను మంజూరు చేసింది. అయితే నెలలు గడుస్తున్నా ఆ మేరకు అధికారిక పత్రాలు అందలేదు. రెండుమూడు పర్యాయాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ అధికారులతో మాట్లాడినా ఫలితం లేదు. దీంతో ఆయన ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం కేసీఆర్... వెంటనే ఢిల్లీకి వెళ్లి స్వయంగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవాలని నిర్ణయించారు. దానిపై చర్చించేందుకే మంగళవారం ఈ సమీక్ష ఏర్పాటు చేయటం విశేషం. వీలైతే వచ్చేనెల మొదటివారంలో ఢిల్లీ పర్యటన ఉంటుందని, ఆ లోపు గడ్కరీతో మాట్లాడి భేటీకి ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్య కార్యదర్శి నర్సింగరావును సీఎం ఆదేశించారు.
 
వెంటనే ఆయన కేంద్రమంత్రి కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి డబుల్ రోడ్లను సుందరంగా నిర్మిస్తుంటే.. జాతీయ రహదారులు నెలల తరబడి గుంతలో ఉండాల్సిన పరిస్థితి సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. మంజూరైన జాతీయ రహదారులను వెంటనే అభివృద్ధి చేయాల్సి ఉందని, ఆ దిశగా నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. అలాగే ఇతర పథకాల కింద రోడ్ల కోసం కేంద్రం నుంచి ఈ సంవత్సరం అదనంగా రూ.వెయ్యి కోట్లు సాధించాలన్నారు.

మరిన్ని వార్తలు