పెద్ద దిక్కు మౌన ముద్ర

2 Aug, 2017 01:15 IST|Sakshi

ఒంగోలు : దేవరపల్లిలో భూ వివాదంలో సాక్షాత్తు జిల్లా రెవెన్యూ అధికారి, తహశీల్దార్‌ దళితుల భూముల స్వాధీనంలో కీలకపాత్ర పోషించారని దేవరపల్లె దళితులు నెత్తినోరు బాదుకున్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రితో పాటు జిల్లాకు చెందిన ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ సైతం దేవరపల్లె విషయంలో ప్రభుత్వం, అధికారులు తప్పు చేశారని బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇది జిల్లా పాలనాధికారికి మచ్చ తెచ్చే విషయమే అయినా మౌనముద్ర వీడలేదు. ఈ అంశం ఒకటే కాదు జిల్లాలోని ఇతర ప్రధాన సమస్యలపైనా ఆయన స్పందన అంతంత మాత్రమేనన్న ప్రచారం ఉంది.

►రిమ్స్‌ మెడికల్‌ కళాశాల విద్యార్థుల కోర్సు పూర్తయి చాలా కాలం అయింది. కళాశాలకు ఎంసీఐ అనుమతులు రాకపోవడంతో విద్యార్థులు నెత్తినోరు బాదుకున్నారు. ప్రజాప్రతినిధుల గడప తొక్కి విన్నవించారు. ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి మాత్రమే స్పందించి వారి సమస్యను కేంద్రం దృష్టికి తెచ్చారు. సకాలంలో ఎంసీఐ రాకపోవడంతో ఆందోళనకు గురైన విద్యార్థులు జిల్లా కలెక్టర్‌ బంగ్లాను ముట్టడించారు. వైద్య విద్యార్థులకు బాసటగా నిలిచి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాల్సిన పాలనాధికారి ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

► రైతుల సమస్యలపైనా ఆయన స్పందించింది లేదు. సుబాబుల్, జామాయిల్‌ కర్రకు గిట్టుబాటు ధర లేక రైతులు నిత్యం ఆందోళనలకు దిగుతున్నారు. సుజాతశర్మ కలెక్టర్‌గా ఉన్న సమయంలో రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, మంత్రి శిద్దా రాఘవరావుతో పలుమార్లు సమావేశం నిర్వహించారు. రైతులకు న్యాయం చేసేందుకు చొరవ చూపారు. కానీ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆ స్థాయి చొరవ చూపించ లేకున్నారు.

► జిల్లాలో తాగునీటి సమస్య పతాకస్థాయికి చేరింది. గతంలో వదిలిన సాగర్‌ జలాలు పూర్తిగా అడుగంటాయి. ప్రస్తుతం జిల్లాకు సాగర్‌ జలాలను తీసుకురావాల్సి ఉంది. మంత్రులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు పెట్టి నీటి విడుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ కలెక్టర్‌ అందుకు పెద్దగా స్పందించినట్లు కనిపించటం లేదు.  

► ఈ–ఆఫీస్‌ పైన కలెక్టర్‌ పెద్దగా శ్రద్ధ పెట్టినట్లు కానరావడం లేదు. ఈ–ఆఫీస్‌ వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం పదే పదే చెబుతున్నా.. జిల్లాలో ఆ ప్రయత్నం వేగం పుంజుకోలేదు. గత కలెక్టర్‌ హయాంలో ఈ–ఆఫీస్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా మొదటి మూడు స్థానాల్లో ఉండింది. నేడు జిల్లా 5వ స్థానానికి పడిపోయింది.

►గ్రీవెన్స్‌ డే వినతుల పరిష్కారానికి కలెక్టరేట్‌లో పెద్దగా కసరత్తు జరగడం లేదు. ప్రజాలిచ్చిన వినతులు ఎంత మేర పరిష్కారమయ్యాయన్న విషయంపై వారం వారం రివ్యూ సమావేశాలు నిర్వహిస్తే అధికారులు త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉండేది. కానీ కలెక్టర్‌ ఈ విషయంలో మొక్కుబడి సమావేశాలకు పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది.

► నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి తీసుకోవాలన్న అధికార పార్టీ నేత ప్రయత్నాలను ఇరిగేషన్‌ ఎస్‌ఈ అడ్డుకున్నా జిల్లా పాలనాధికారి స్పందించినట్లు కనిపించలేదు. విలువైన ప్రభుత్వ స్థలాలు పార్టీ కార్యాలయాలకు అప్పగిస్తే ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు లేకుండాపోయే ప్రమాదం ఉంది. అధికార పార్టీ నేత పట్టుపట్టి ఇరిగేషన్‌ ఎస్‌ఈని బదిలీ చేయించారు. అధికార పార్టీ నేత జిల్లా స్థాయి అధికారిని బదిలీ చేయిస్తే ప్రధాన అధికారి పట్టించుకోకపోతే మిగిలిన అధికారుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు వాపోతున్నారు.

►జిల్లాలో అభివృద్ధి పనుల టెండర్ల వ్యవహారం రచ్చకెక్కింది. పేరుకు ఈ–టెండర్లు అయినా అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారు. కొందరు అధికారులు వాటాలు తీసుకొని పనులను అబౌ రేట్లకు కేటాయించి ప్రజాధనానికి గండి కొడుతున్నారు. వెలిగొండ, గుండ్లకమ్మ పునరావాస పనుల టెండర్లలో ఇదే జరిగింది.

►కార్పొరేషన్‌ టెండర్ల వ్యవహారం ఇంతకు మించి అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. వేరే కాంట్రాక్టర్లు పోటీకి రాకుండా అధికారులే అడ్డుకుంటున్నారు. ఇష్టానుసారంగా అబౌ రేట్లకు పనులు అప్పగిస్తున్నారు. జిల్లా పాలనాధికారి ప్రత్యేకాధికారిగా ఉన్నా.. ఇక్కడి అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు.

అధికార పార్టీ ఒత్తిడులతో జిల్లాలో కొందరు కింది స్థాయి అధికారులు ఇబ్బందులు పడుతుండగా వారికి పెద్ద దిక్కుగా భరోసా కల్పించాల్సిన పాలనాధికారి మౌనంగా ఉన్నారని, కొందరు అధికారులు పార్టీ నేతల అండ చూసుకొని చెలరేగిపోతున్నా వారిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని అధికార వర్గాలే విమర్శిస్తుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు