పోలవరం భూముల్లో 'పెద్దల పాగా'

8 Dec, 2015 09:57 IST|Sakshi
  • ప్రాజెక్ట్ కోసం గిరిజనుల నుంచి సేకరించిన స్థలాల్లో ప్రైవేటు రిసార్ట్స్
  •  అనుమతులు లేకుండా రాత్రి సమయాల్లో నిర్మాణం
  •  రెండు నెలలుగా పనులు చేస్తున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం
  •  
    ఏలూరు/పోలవరం : జాతీయ బహుళార్థసాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం గిరిజనుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూముల్లో పెద్దలు పాగా వేస్తున్నారు. ముంపు గ్రామాల్లో గిరిజనులను ఖాళీ చేయించేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్న అధికారులు.. ప్రాజెక్టు భూముల్లో రిసార్ట్స్ నిర్మాణం జరుగుతున్నా తమకు ఏమీ తెలియదన్నట్టు నిద్ర నటిస్తున్నారు.
     
     పోలవరం ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో నిర్వాసితులు సహా ఎవరూ వ్యవసాయం చేయకూడదని, అలా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ.. ఆ భూముల్లోనే అడ్డగోలుగా రిసార్ట్స్ నిర్మాణం సాగుతున్నా నోరు మెదపడం లేదు. వివరాల్లోకి వెళితే..
     
     పోలవరం మండలం శివగిరి ప్రాంతంలో అరగంటి కృష్ణారెడ్డి, ఆయన కుమార్తె అరగంటి కృష్ణకుమారిలకు 12.24 ఎకరాల భూమి ఉండేది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ఈ భూమిని సేకరించింది. దీనికి బదులుగా జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలోని 106, 86, 73/1, 11/5, 99, 102 సర్వే నంబర్లలో 12.24  ఎకరాల భూమిని కృష్ణారెడ్డి, కృష్ణకుమారిలకు కేటాయించారు. శివగిరిలో ప్రభుత్వం సేకరించిన భూమిలో రెండు నెలలుగా టూరిజం గెస్ట్‌హౌస్‌లు, రిసార్ట్స్ నిర్మాణాలు సాగుతున్నాయి.
     
     ఇప్పటికే పది గెస్ట్‌హౌస్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవు. భీమవరం వాస్తవ్యుడు, ప్రస్తుతం  హైదరాబాద్‌లో ఉంటున్న ఓ వ్యాపారి ఈ రిసార్ట్స్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిని గిరిజనులే నిర్మించుకుంటున్నారని, తాము నిర్మాణ పనులు మాత్రమే చేస్తున్నామని అక్కడి పనులను పర్యవేక్షిస్తున్న వ్యాపారి సంబంధీకులు చెప్పుకొస్తున్నారు.
     
     అవునా.. తెలియదే
     శివగిరి గ్రామం వద్ద రిసార్ట్స్ నిర్మిస్తున్న విషయాన్ని పోలవరం ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ అధికారి, జంగారెడ్డిగుడెం ఆర్డీఓ ఎస్.లవన్న దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా.. ‘అవునా.. ఆ విషయం నాకు తెలియదే’ అని వ్యాఖ్యానించారు. ఆర్ అండ్ ఆర్ వ్యవహారాల్లో నిమగ్నమై ఉండటం వల్ల ఆ విషయంపై దృష్టి సారించలేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగినట్టు తేలితే త్వరలోనే ఆ రిసార్ట్స్‌ను తొలగిస్తామన్నారు.

మరిన్ని వార్తలు